
ప్రయోజనాలేవి?
పదవీ విరమణ..
● బెనిఫిట్స్ డబ్బులు చెల్లింపుల్లో జాప్యం ● న్యాయపోరాటానికి రిటైర్డ్ ఉద్యోగులు
జిల్లా ట్రెజరీ కార్యాలయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జోగిపేట్ ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఆరు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అయితే రావాల్సిన డబ్బులు ఏడాది దగ్గర పడుతున్నా ఇప్పటికీ అందలేదు. కుటుంబసభ్యుల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి బాగోలేక వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా...హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు రావాల్సిన డబ్బులను అధికారులు విడుదల చేశారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. తమకు రావాల్సిన డబ్బులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలా తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న వారు జిల్లాలో క్రమంగా పెరుగుతున్నారు. ఇప్పటివరకు సుమారు 50 మంది వరకు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న వారిలో విద్యాశాఖకు చెందిన ఉపాధ్యాయ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
ఏడాదికి పైగా ఆలస్యం..
జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారు 12 వేల మంది వరకు పనిచేస్తున్నట్లు అనధికారిక అంచనా. ఇందులో ప్రతీనెల సుమారు వంద మంది వరకు పదవీ విరమణ పొందుతున్నారు. ఇందులో అత్యధికంగా ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్‌శాఖ, రెవెన్యూ, పోలీసుశాఖల ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. విద్యుత్, ఆర్టీసీ, మార్కెటింగ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కాకుండా మిగిలిన వారు ట్రెజరీ ద్వారా రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందుతుంటారు. ఇలా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి ఫార్వర్డింగ్ అథారిటీ అధికారులు ఈ బెనిఫిట్స్‌కు సంబంధించిన పత్రాలను ట్రెజరీలకు పంపుతారు. ఈ ట్రెజరీ అధికారులు వాటిని ఆర్థికశాఖకు సంబంధించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో పొందుపరిచి ఆ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా పదవీ విరమణ చేసిన వారి ఖాతాల్లో జమ చేస్తుంటారు. అయితే గత ప్రభుత్వ హాయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో 2024 మార్చి వరకు పెద్దగా ఉద్యోగులు రిటైర్డ్ కాలేదు. మళ్లీ ఇప్పుడు పదవీ విరమణలు అవుతున్నాయి. అయితే వీరికి ఏడాదికిపైగా రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులు అందకపోతుండటంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
రూ.20 లక్షల నుంచి రూ.1.30 కోట్ల వరకు
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకురిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. ఈ డబ్బులు సకాలంలో రాకపోవడంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై పలుమార్లు మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలను అందిస్తున్నాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు.
– చంద్రశేఖర్, రిటైర్డ్ ఉద్యోగుల
అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు
పదవీ విరమణ అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసు కాలం, బేసిక్‌పే, వారి కేడర్ ఆధారంగా రిటైర్మెంట్ డబ్బులు వస్తుంటాయి. కనిష్టంగా రూ.20 లక్షల నుంచి రూ.1.40 కోట్ల వరకు వారికి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. గ్రాట్యూటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జీపీఎఫ్, గ్రూప్ ఇన్స్యూరెన్స్ ఇలా వివిధ రూపాల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ మొత్తాన్ని చెల్లించాలి. అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ మొత్తాన్ని చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

ప్రయోజనాలేవి?