
కేతకీలో భక్తుల సందడి
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయం గురువారం భక్తులతో సందడిగా మారింది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి, గుండంలోని జలలింగానికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని పార్వతిపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయన పూజారులు భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
టీకాలపై రైతులకు
అవగాహన కల్పించాలి
జేడీఏ వసంతకుమారి
కంది(సంగారెడ్డి): గాలికుంటు టీకాలపై రైతులకు అవగాహన కల్పించాలని పశువైద్య శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి సూచించారు. మండల కేంద్రమైన కందిలో గల పశువైద్యశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ...పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉండేందుకు వేసే టీకాలను ఆవులు,గేదెలకు తప్పకుండా వేయించాలన్నారు. రోగాల బారిన పడిన పశువులకు జాప్యం చేయకుండా వెంటనే చికిత్స అందించాలన్నారు. అనంతరం రికార్డులను జేడీఏ పరిశీలించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి జీనత్‌భానుతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
చట్టసభల్లో
50% రిజర్వేషన్లు ఇవ్వాలి
సంగారెడ్డి: చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండు గురువారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని ప్రకటించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని కేంద్రం ఆమోదించాలన్నారు. దేశ వ్యాప్తంగా కులగణనపై పోరాడిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, బాలు ఉన్నారు.
వైద్య సేవలపై ఆరా
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఇటీవల నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్ర భవనాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...భవనాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు. ఆస్పత్రిలో రోగులకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు. వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలపై గాయత్రీదేవి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
డీలక్స్ బస్సులలో రాయితీ
నారాయణఖేడ్: ఆర్టీసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ చార్జీల్లో 10% రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఖేడ్ డిపో మేనేజర్ మల్లేశయ్య గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నెలవారీ సీజన్ టికెట్‌పై 20 రోజుల చార్జీతో 30 రోజులు ప్రయాణం చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ సదుపాయం ఈ నెల 1వ నుంచి అమలులోకి వచ్చిందన్నారు. ఖేడ్ నుంచి జేబీఎస్‌కు రూ.230 చార్జీకి గాను రాయితీతో రూ.210లు చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. ఖేడ్ నుంచి లింగంపల్లికి రూ.210కిగాను రూ.190, ఖేడ్ నుంచి సంగారెడ్డికి రూ.160కి గాను రూ.140 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. అదేవిధంగా ఖేడ్ నుంచి సంగారెడ్డి వరకు గల వివిధ స్టేజీలకు మంత్లీ సీజన్ టికెట్స్ ఇవ్వనున్నట్లు డీఎం చెప్పారు.