
రూ.20 లక్షల విలువైన గంజాయి పట్టివేత
● హైదరాబాద్ నుంచి కర్ణాటకకు తరలింపు ● పోలీసుల అదుపులో నిందితుడు
జహీరాబాద్: అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసినట్లు చిరాగ్‌పల్లి ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. చిరాగ్‌పల్లి సమీపంలో గల సహారా దాబా వద్ద 65వ జాతీయ రహదారిపై సీసీఎస్ బృందంతో కలిసి మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ వైపు నుంచి కర్ణాటక వైపు అనుమానాస్పదంగా వస్తున్న టాటా ఇండిగో కారును తనిఖీ చేయగా డిక్కీలో గోధుమ రంగు కవర్ చుట్టి 40 ఎండు గంజాయి ప్యాకెట్లు లభించాయి. నిందితుడు, కారు డ్రైవర్ జహీరాబాద్ మండలంలోని గోవింద్‌పూర్ గ్రామానికి చెందిన జీ.తిరుమలేశ్‌గా గుర్తించారు. నిందితుడి దూరపు బంధువైన బీదర్‌కు చెందిన గుండప్ప చెప్పినట్లుగా రూ.50 వేలకు ఆశ పడి కారులో గంజాయిని బగ్దల్‌లో ఉన్న వినోద్‌కు ఇచ్చేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి సుమారు 80 కిలోల వరకు ఉంటుందని, రూ.20 లక్షలు విలువ చేస్తుందని ఎస్‌ఐ వివరించారు. కారుతోపాటు సెల్‌ఫోన్ సీజ్ చేసి నిందితుడిని కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు.