
నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోండి
న్యాల్‌కల్(జహీరాబాద్): ఇందిరమ్మ ఇళ్లను నిబంధనల ప్రకారమే నిర్మించుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లబ్ధిదారులకు సూచించారు. మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులు నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలని లేకుంటే ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతారని వివరించారు. అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని, అనంతరం సమీపంలోని మిషన్ భగీరథ పంప్‌హౌస్‌ను పరిశీలించారు. వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున మండలంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎంపీడీఓ రాజశేఖర్ కౌలాస్‌కు సూచించారు. ఏ గ్రామంలోనైనా నీటి సమస్య ఉందా?అని అడిషనల్ కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీఓ వనజ, ఏపీఓ రంగారావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు.