
రజతోత్సవ సభను విజయంతం చేయాలి
పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రెడ్డి
సదాశివపేట(సంగారెడ్డి): బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ప్రజలందరూ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పీఏసిఎస్ చైర్మన్ రత్నాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సదాశివపేటలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విరక్తి ఏర్పడి ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, సోషల్ మీడియాలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని తెలిపారు. కేసీఆర్ బహిరంగ సభ ద్వారా దేశరాజకీయల్లో చర్చ జరుగుతుందన్నారు. ప్రజల మనిషి కేసీఆర్ సభ కోసం ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
చీటింగ్ కేసులో
అఘోరీ రిమాండ్
● లింగ నిర్ధారణ పరీక్షలకు నిరాకరణ
● తిరిగి కోర్టుకు పంపిన అధికారులు
సంగారెడ్డి టౌన్: ఓ చీటింగ్ కేసులో అఘోరీని బుధవారం చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సంగారెడ్డి జిల్లాలోని కంది సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఇక్కడ జైలు అధికారులకు అఘోరీని ఏ బారక్‌లో ఉంచాలో అనే టెన్షన్ మొదలైంది. అయితే లింగ నిర్ధారణ పరీక్షలకు నిరాకరించడంతో తిరిగి చేవెళ్ల కోర్టుకు పంపించినట్టు జైలు పర్యవేక్షకులు సంతోష్ రాయ్ తెలిపారు.
బొంతపల్లిలో
ఇరు వర్గాల ఘర్షణ
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మండల కేంద్రంలో విగ్రహ ధ్వంసం చేసిన ఘటన నేపథ్యంలో పలు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి ప్రధాన రహదారిపై కారులో వెళ్తున్న ఓ వర్గానికి చెందినవారు రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో మరో వర్గానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల వారికి నచ్చజెప్పి వారిని శాంతింపచేశారు. మరో వర్గం విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోడ్డుపై ధర్నా చేయడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ట్రాన్స్‌ఫార్మర్‌ను
పగులగొట్టి ఆయిల్ చోరీ
దుబ్బాకటౌన్: రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో మల్కాపూర్ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వద్ద గల వ్యవసాయ పొలంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టారు. దానిలోని కాయిల్స్, ఆయిల్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన రైతులు పోలీసులకు విద్యుత్, అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సుమారు వాటి విలు రూ. 50 వేల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. రైతు మల్లమ్మ ఫిర్యాదు మేరకు బేగంపేట ఎస్సై మహిపాల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నా భర్త ఆచూకీ తెలపండి
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన శశికళ తన భర్త కనిపించడం లేదని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా ఆమె తన భర్త మహేశ్‌తో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అయితే ఈ క్రమంలో చాకలి గోపాల్, బండి శోభలు కలిసి శశికళ అత్తమ్మ(64)ను మార్చి 25న బంగారు ఆభరణాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి హత్య చేసినట్లు పోలీసులు స్వగ్రామానికి వచ్చారు. దీంతో తన భర్త ఆచూకీ కనిపెట్టాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మందుబాబులకు జరిమానా
సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డి పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి పాత బస్టాండ్‌వద్ద, జాతీయ రహదారి, బైపాస్‌లోని గుర్రపు బొమ్మ వద్ద నిర్వహించిన డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ ఒకరికి రూ.2వేలు, మిగతా నలుగురికి రూ.1,500 చొప్పున జరిమానా విధించారు.