
మాట్లాడుతున్న యడ్యూరప్ప
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప
జహీరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఇచ్చిన హామీలను నమ్మొద్దని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. బుధవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి రాంచందర్ రాజనర్సింహ మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటిని విస్మరించిందన్నారు. రైతుల సంక్షేమం కోసం తాను ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయకుండా రైతులకు తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. తాను ప్రవేశపెట్టిన పలు పథకాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య విభేదాలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఖజానా సైతం ఖాళీ అయ్యిందని, దీంతో ప్రభుత్వం దివాలా తీసిందని ఆరోపించారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలనే అమలు చేయలేని పరిస్థితిలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, తెలంగాణలో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయగలుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో కీచులాటలు తప్ప ఏమీ లేదన్నారు. మోదీ నాయకత్వాన్ని మరింత బలపర్చేందుకు రాంచందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.