
ఉమ్మడి జిల్లాలో వారిదే మెజార్టీ
● వర్తమాన పరిస్థితులపై పూర్తి అవగాహన ● పార్టీల ఫోకస్
ఉమ్మడి మెదక్ జిల్లాలో యువ ఓటర్లు క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. మెజార్టీ ఓటర్లుగా ఉండటంతో వీరు తీసుకునే నిర్ణయంపైనే అభ్యర్థుల భవిత ఆధారపడి ఉంది. ఐదేళ్లకోసారి వచ్చే అద్భుత అవకాశం ఇప్పుడు యువత చేతిలో ఉంది. సంక్షేమం, అభివృద్ధి ఆకాంక్షించే నాయకులను ఎన్నుకుంటారని భావించవచ్చు.
నారాయణఖేడ్: దేశ భవిష్యత్ నిర్ణయించడంలో నేటి యువతది కీలక పాత్ర. వారు రాజకీయంలో కీలక పాత్ర పోషిస్తారనడంతో ఎటువంటి సందేహమూ లేదు. ఇప్పుడున్న వారిలో వంద శాతం అక్షరాస్యులే. కాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న మెజార్టీ ఓటర్లుగా యువత ఉంది. వీరు ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం తేల్చగలరు. సంగారెడ్డి జిల్లాలో 18– 19 ఏళ్ల వయసు గల ఓటర్లు 50, 684 మంది ఉండగా, 20– 29 ఏళ్ల వయసు 3,11,433, 30–39 ఏళ్ల వారు 4,36,764, 40–49 ఏళ్ల వారు 2,72,554 మంది ఉన్నారు. మెదక్ జిల్లాలో 18–19 వయసు ఉన్న వారు 17,061, 20–29 ఏళ్ల వారు 97,390, 30–39 ఏళ్ల వారు 1,15,164, 40–49 ఏళ్ల వారు 94,638 మంది ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 18–19 ఏళ్ల వారు 28,535, 20–29 ఏళ్ల మధ్య 2,00,676, 30–39 ఏళ్ల వారు 2,60,200, 40–49 ఏళ్ల వారు 1,82,977 మంది ఉన్నారు.
యువతపై నేతల దృష్టి..
యువ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం, వారు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉండటంతో రాజకీయ నాయకులు సైతం వారిపై దృష్టి సారిస్తున్నారు. ఎలాగోలా తమకు మద్దతుగా ఉండేలా ఓటు వేసేలా వారిని చైతన్య పర్చాలని ఉవ్విళ్లూరుతున్నారు. తాము గెలిస్తే వారి కోసం చేపట్టబోయే పనుల గురించి వివరిస్తూ గెలుపే లక్ష్యంగా వారిని ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు.
ప్రలోభాలకు లొంగే అవకాశం తక్కువే..
ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు రాజకీయ నాయకులు రకరకాల వస్తువులు కానుకలుగా ఇస్తుంటారు. సామాన్యుల్లో కొందరు వారి పరిస్థితుల దృష్ట్యా రాజకీయ నాయకులు ఇచ్చిన వాటికి కట్టుబడి ఓటు వేసే అవకాశం ఉంది. కానీ యువత అలా కాదు. ఎవరు మంచి చేస్తారో వారికే మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. చదువుతున్న యువతతో పాటు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఇంటికొకరు ఉంటారు. దీంతో ప్రతి కుటుంబంలో వర్తమాన రాజకీయాలు చర్చిస్తూ, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తుంటారు. వారి ఓటుతోపాటు తమ కుటుంబసభ్యుల ఓట్లు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు, ఓటముల్లో యువత పాత్ర కీలకం కానుంది.
జిల్లా మొత్తం ఓటర్లు
సంగారెడ్డి 9,96,474
సిద్దిపేట 9,48,669
మెదక్ 4,40,341
