Gujarat Assembly Elections: ఏ మ్యానిఫెస్టోలో ఏముంది?

Gujarat Assembly Elections 2022: What Is In Parties Manifesto - Sakshi

ఇవ్వాళ (డిసెంబర్ 1) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తొలి దశ జరిగింది. ఈ నెల 5వ తేదీ (సోమవారం) రెండో దశ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న (గురువారం) ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది? మ్యానిఫెస్టోలో ఏం పెట్టింది? 

బీజేపీ ఏం హామీలిస్తోంది?
కంచుకోట గుజరాత్లో వరుసగా ఏడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న కమలం పార్టీ.. ఓటర్లపై వరాల జల్లు కురిపించింది. బీజేపీ అధికారంలోకి రాగానే.. యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామంటున్నారు పార్టీ అధ్యక్షుడు నడ్డా. ఈ విషయంపై అధ్యయనం చేసేందుకు కేబినెట్ ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గుజరాతీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు జేపీ నడ్డా. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఉగ్రవాదం, తీవ్రవాద భావజాలాన్ని నిర్మూలించేందుకు.. యాంటీ ర్యాడికల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు జేపీ నడ్డా.

హస్తం పార్టీ ఏం హామీ ఇస్తోంది?
గుజరాత్లో అధికారంలోకి వస్తే మోదీ స్టేడియం పేరు మారుస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్టేడియానికి సర్దాల్ పటేల్ పేరు పెడతామని ప్రకటించింది. 3 లక్షలవరకు రైతు రుణ మాఫీ.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీలు ఇచ్చింది హస్తం పార్టీ. 10లక్షల ఉద్యోగాలు.. యువతకు 3వేల నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్టు మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, గుజరాత్ వ్యాప్తంగా మూడువేల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రీఓపెన్ హామీలు గుప్పించింది. గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే.. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు అశోక్ గెహ్లాట్.

ఆమ్ అద్మీ మాటేంటీ?
బీజేపీ కంచుకోటలో పాగా వేయాలని తహతహలాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. రైతు బిడ్డకు కీలక బాధ్యతలు అప్పగించింది. సామాన్యుడిగా వచ్చి.. పాపులర్ టీవీ యాంకర్గా ఎదిగిన ఈశుదాన్ గఢ్వీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. పంజాబ్ విజయంతో ఊపుమీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాత్లోనూ సత్తా చాటాలని తీవ్రస్థాయిలో శ్రమిస్తోంది. 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని ఆమ్ అద్మీ చెబుతోంది. అలాగే ఉచిత విద్య అందరికీ అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. విద్యతో పాటు వైద్యం వంటి ఆకర్షణీయ హామీలతో ప్రజల్లోకి వెళ్లింది. 

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top