వివాదాల ‘హౌస్‌లు’ | - | Sakshi
Sakshi News home page

వివాదాల ‘హౌస్‌లు’

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

అసాంఘిక కార్యకలాపాలకు

అడ్డాలుగా ఫాంహౌస్‌లు

డ్రగ్స్‌, పేకాట, కోడి పందేలు,

వ్యభిచారం, రేవ్‌, ముజ్రా పార్టీలు

యథేచ్ఛగా గంజాయి, హుక్కా,

మద్యం వినియోగం

తరచూ వార్తల్లో నిలుస్తున్న వైనం

మొయినాబాద్‌: సరదాలు, వారాంతపు విడిదిలకోసం నిర్మించుకున్న ఫాంహౌస్‌లు తరచూ వివాదాల్లో నిలుస్తున్నాయి. తప్పుడు పనులకు, అక్రమాలకు అడ్డాలుగా మారి తరచూ వార్తల్లోకెక్కుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు సాయి భగీరథ్‌పై పోక్సో కేసు పెట్టడంతో మరోసారి ఫాంహౌస్‌ల వ్యవహారం తెరపైకి వచ్చింది. సరదా పార్టీలు, మందు పార్టీలు, రేవ్‌ పార్టీలు, డ్రగ్స్‌ పార్టీలు, ముజ్రా పార్టీలతోపాటు వ్యభిచారం వంటి గలీజు వ్యవహారాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడిచేసి గుట్టు రట్టు చేస్తున్నా వీటికి అడ్డుకట్ట మాత్రం పడటంలేదు. పలు రకాల సెటిల్‌మెంట్లు, రాజకీయ నేతల రహస్య బేటీలు సైతం ఫాంహౌసుల్లోనే జరుగుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది.

లీజుకు.. అద్దెకు

మహానగర శివారుల్లోని మొయినాబాద్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి, శంషాబాద్‌, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్‌, కీసర, శామీర్‌పేట్‌, మేడ్చల్‌ తదితర ప్రాంతాల్లో చాలా మంది ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న ఈ ప్రాంతాల్లో చాలా మంది 10 గుంటల నుంచి ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్‌ నిర్మిస్తున్నారు. 11 జీవో పరిధిలో ఉన్న మొయినాబాద్‌, శంషాబాద్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి ప్రాంతాల్లో మరీ ఎక్కువ ఫాంహౌస్‌లు ఉన్నాయి. ఫాంహౌస్‌ల్లో చాలా వరకు రాజకీయ, సినిమా, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు, వీఐపీలవి ఉన్నాయి. వీకెండ్స్‌లో పిల్లలతో వచ్చి ఆనందంగా గడపడానికంటూ ఫాంహౌస్‌లు నిర్మించుకుని.. కొందరు వాటిని ఇతరులకు లీజుకు, అద్దెకు ఇస్తున్నారు.

అడ్డగోలు దందాలు

ఫాంహౌస్‌లను అద్దెకు తీసుకుంటున్న నిర్వాహకులు వాటిలో అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్‌టుగెదర్‌ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు, బర్త్‌డేలు అంటూ రోజువారీగా అద్దెకిస్తున్నారు. వీటితోపాటు రేవ్‌ పార్టీలు, ముజ్రా పార్టీలు, పేకాట, కోడి పందేలు సైతం నిర్వహిస్తున్నారు. ఫాంహౌస్‌లకు వచ్చే యువకులను ఆకర్షించే విధంగా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఫాంహౌస్‌ల్లో నిర్వహించే పార్టీల్లో అక్రమంగా మద్యం తాగడం, హుక్కా, గంజాయి, డ్రగ్స్‌ వినియోగం జరుగుతోంది. కొన్ని ఫాంహౌస్‌ల్లో పేకాట, కోడి పందేలు సైతం జోరుగా ఆడుతున్నారు.

ప్రముఖుల ఫాంహౌస్‌ల్లో..

శివారుల్లో ఉన్న ప్రముఖుల ఫాంహౌస్‌ల్లో తరచూ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. నగరానికి అతి చేరువలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు ఒప్పందానికి వేదికగా మారింది. పోలీసులు దాడి చేసి గుట్టును రట్టుచేశారు. గత మార్చి 14న రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతుండగా ఈగల్‌ టీం పోలీసులు అక్కడకు చేరుకోగానే గన్‌ ఫైరింగ్‌ జరిగింది. ఈ కేసులో రోహిత్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు జైలుకు వెళ్లారు. డ్రగ్స్‌ పార్టీలో ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌ కూడా ఉన్నారు.

● ఏడాది క్రితం తోలుకట్టలోని ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. పోలీసులు దాడి చేసి పందేలు నిర్వహించిన ఏపీ మంత్రి నారా లోకేష్‌ సన్నిహితుడు శివకుమార్‌తోపాటు 64 మందిని అరెస్టు చేశారు. 55 కార్లు, 84 కోళ్లు, రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

వెలుగుచూస్తున్న వరుస ఘటనలు

● ఏడాది క్రితం కనకమామిడి రెవెన్యూలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మహిళలను ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

● ఏడాదిన్నర క్రితం నజీబ్‌నగర్‌ రెవెన్యూలోని ఓ ఫాంహౌస్‌ ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ముజ్రా పార్టీ నిర్వాహకులతోపాటు ఆరుగురు యువకులు, నలుగురు యువతులను పట్టుకున్నారు.

● రెండేళ్ల క్రితం కనకమామిడి రెవెన్యూ పరిధిలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

● ఏడాది క్రితం అజీజ్‌నగర్‌ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో పేకాట స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు.

● ఏడాది క్రితం ఎత్‌బార్‌పల్లిలోని ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. 13 మంది యువకులు, ఏడుగురు యువతులను పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి, హుక్క పాట్స్‌, మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

● కొంత కాలం క్రితం చేవెళ్లలోని ఓ రిసార్ట్స్‌లో ప్రముఖ సింగర్‌ మంగ్లీ అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహిస్తూ మద్యం వినియోగించడంతో పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేశారు.

● ఆరు నెలల క్రితం పెద్దమంగళారంలోని ఓ ఫాంహౌస్‌లో ‘ట్రాప్‌ హౌస్‌ 9 ఎంఎం’ పేరుతో నిర్వహించిన మత్తు పార్టీని భగ్నం చేసి 62 మందిని పట్టుకున్నారు. అందులో 22 మంది మైనర్లు ఉండటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement