నియోజకవర్గ సభలను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ సభలను జయప్రదం చేయాలి

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

సాక్షి, రంగారెడ్డిజిల్లా: నియోజకవర్గ స్థాయిలో శనివారం నిర్వహించే సభలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సంబంధిత అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గం స్థాయి సభలు సమర్థవంతంగా నిర్వహించాలన్న ప్రభుత్వ సూచన మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పాఠశాల/మండల కార్యలయం/బహిరంగ ప్రదేశం/ఏదైనా ఇతర అనువైన వేదికను ఏర్పాటు చేసి ఉదయం 10 గంటలకు మండల స్థాయి సభలను ప్రారంభించాలని తెలిపారు. సభల్లో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. సభలను రాష్ట్ర గీతంతో ప్రారంభించాలని, ముఖ్యమంత్రి సందేశం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చదివి వినిపించాలని సూచించారు. ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై చర్చించాలని, సభల్లో ఆర్డీఓలు, తహసీల్దార్‌, ఎంపీడీఓ, వార్డు సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, రైతులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఉండేలా చూడాలన్నారు. మహిళలు, వృద్ధులు కూర్చునేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రదర్శన కోసం స్క్రీన్‌, ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేయాలని, పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తాగునీరు, నీడ కోసం ఏర్పాట్లు చేయాలని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం స్థాయి సభ బ్యానర్‌ ప్రదర్శించాలని వివరించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) చంద్రారెడ్డి, (స్థానిక సంస్థలు) కిరణ్మయి, ఆర్డీఓలు, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, సీపీఓ సౌమ్య, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

‘నీట్‌’ను పకడ్బందీగా నిర్వహించాలి

ఈ నెల 3న నీట్‌ పరీక్ష నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థులను ఉదయం 11 నుంచి కేంద్రాలకు అనుమతిస్తారని, మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూయడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్‌ విధానం ద్వారా తీసుకోవడం జరుగుతుందని, ఏదైనా సమస్య తలెత్తి ధ్రువీకరణ పూర్తి కాకపోయినా, అభ్యర్థిని పరీక్ష గదిలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారన్నారు. అయితే లిఖిత పూర్వక హామీ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. హామీ పత్రం నమూనా పరీక్ష కేంద్రంలో అందిస్తారన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి డిజిటల్‌ పరికరాలు అనుమతించరని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల రవాణాపై పోలీస్‌, రెవెన్యూ, తపాలా శాఖల అధికారుల సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టాలని, పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్‌ రూమ్‌, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్ష ముగిసిన తరువాత ఓఎంఆర్‌ పత్రాల తరలింపు పకడ్బందీగా చేపట్టాలన్నారు. పరీక్ష సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా, వైద్య–ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించి ఓఆర్‌ఎస్‌, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు.

కలెక్టర్‌ నారాయణ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement