బోగస్ చెక్కులతో బురిడీ.. ఇద్దరు స్కూల్ డైరెక్టర్ల అరెస్టు
బంజారాహిల్స్: అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడి పేరిట డబ్బులు తీసుకుని బోగస్ చెక్కులు ఇచ్చిన ఇద్దరు స్కూల్ డైరెక్టర్లను బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఎస్‌ఐ విజయ్ కొట్టూర్ కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని ఇందిరానగర్–కమలాపురికాలనీలో బడ్స్ అండ్ ఫ్లవర్స్ పాఠశాల ఉంది. చనుబోయిన గోవింద్, ఆయన భార్య చనుబోయిన శ్రీదేవి డైరెక్టర్లుగా, కలిగెట్ల లక్ష్మీ ప్రసన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు. తమ పాఠశాలను బ్రాంచీలుగా విస్తరిస్తున్నామని, పెట్టుబడి పెడితే అధిక లాభాలిస్తామని గోవింద్, శ్రీదేవి చెప్పడంతో ఎస్‌ఎస్‌రెడ్డి అనే వ్యాపారి రూ.50 లక్షల పెట్టుబడి పెట్టాడు. లాభాల విషయమై వారు దాటవేస్తుండటంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు గోవింద్, శ్రీదేవిలను కోరాడు. ఈ మేరకు వారు గత నెల మొదటివారంలో ఆయనకు ఆరు చెక్కులు ఇచ్చారు. వాటిని బ్యాంక్‌లో డిపాజిట్ చేయడానికి వెళ్లగా అవి బ్లాక్ అయిన బ్యాంక్ అకౌంట్ చెక్కులని తేలింది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు గోవింద్, శ్రీదేవిలను కలవడానికి పలుమార్లు స్కూల్‌కు వెళ్లగా బౌన్సర్లతో అడ్డుకుని దాడులు చేయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


