ఆమనగల్లు: ఎండలు రోజురోజుకూ మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి భగభగలు సుర్రుమంటున్నాయి. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండలు ఎక్కువ కావడంతో సీజనల్ వ్యాపారాలు మొదలయ్యాయి. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి శీతల పానీయాలు, కొబ్బరిబొండాలు సేవిస్తున్నారు. ఈ ఏడాది ఎండలు అధికంగానే ఉంటాయని వస్తున్న వార్తల నేపథ్యంలో భయపడుతున్నారు. ఆమనగల్లు పట్టణంలో ఉదయం, రాత్రి వేళల్లో కొద్దిగా చల్లగా ఉంటున్నా మధ్యాహ్నం మాత్రం ఎండలు సుర్రుమంటున్నాయి. ప్రస్తుతం ఎండలు 34 డిగ్రీలు దాటిపోయాయి. ఉదయం 10 గంటలు దాటితే చాలు ఎండవేడిని తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కొబ్బరిబొండాలను రూ.40 నుంచి 60 వరకు విక్రయిస్తుండగా పండ్ల రసాలను గ్లాస్‌కు రూ.20 నుంచి 40 వరకు అమ్ముతున్నారు. అలాగే పండ్లు, పుచ్చకాయలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
మట్టికుండలకు భలే గిరాకీ
పట్టణంలో మట్టికుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని నీరు సేవిస్తున్నారు. ఇందుకోసం చాలామంది మట్టి కుండలను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఫ్రిడ్జ్ నీరు తాగడం మానేసి మట్టికుండ నీరుకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
వారం రోజులుగా
అధికమవుతున్న ఉష్ణోగ్రతలు
నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు
ఊపందుకున్న శీతల పానీయాల విక్రయాలు
భానుడి భగభగలు
మొయినాబాద్‌రూరల్: సూర్యుడి భగభగలకు ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి రాలేక పోతున్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మండుతున్న ఎండకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మరింత ఎండలు ముదిరే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.


