ఎరువు కొరత.. తీరని వ్యథ | - | Sakshi
Sakshi News home page

ఎరువు కొరత.. తీరని వ్యథ

Apr 6 2026 8:36 AM | Updated on Apr 6 2026 8:36 AM

కుల్కచర్ల: రైతు సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం. వ్యవసాయ రంగాన్ని పండగ చేస్తాం అని ప్రభుత్వాలు, పాలకులు పదేపదే చెబుతున్నా.. అన్నదాతల యూరియా కష్టాలు తీరడం లేదు. డిమాండ్‌ను బట్టి సరిపడా ఎరువు అందుబాటులో ఉందంటూ అధికారులు పేర్కొంటున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. యూరియా పక్కదారి పట్టకుండా, కర్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం తెచ్చినా.. ఒక్క సంచి దొరకని పరిస్థితి.

ఒక్క సంచి లేదాయె

చౌడాపూర్‌ మండలంలో 24 గ్రామ పంచాయతీలు, వాటికి అనుబంధంగా సూమారు 40 గిరిజన ఆవాసాలు ఉన్నాయి. వీరిలో ఎక్కువశాతం మందిది వ్యవసాయ ఆధారిత జీవనమే. గత ఏడాది యూరియా కొరత అధికంగా ఉండటంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే మండలంలో రెండు ప్రభుత్వ అనుబంధ ఎరువుల దుకాణాలు ఉన్నాయి. శనివారం వరకు ఆయా షాపుల్లో ఒక్క యూరియా సంచి కూడా అందుబాటులో లేని దుస్థితి. ఆన్‌లైన్‌లో మండలంలోని దుకాణం చూపించకుండా.. కుల్కచర్ల మండలంలోని దుకాణాలను చూపించండం గమనార్హం. విధిలేక మండల పరిధి మరికల్‌, కల్మన్‌కాల్వ, చాకల్‌పల్లి, కొత్తపల్లి గ్రామాల రైతులు.. సూమారు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుల్కచర్లకు మండల కేంద్రానికి వెళ్లి ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఒక్కటి కావాలన్నా అక్కడికి వెళ్లాల్సి వస్తోందని కర్షకులు తెలిపారు. గంటల కొద్ది వేచి చూడాల్సి వస్తుందంటున్నారు. దీంతో దూరభారంతో పాటు సమయం వృథా.. రవాణా ఖర్చు తడిసి మోపవుతోందని కర్షకులు పేర్కొంటున్నారు.

రైతులకు యూరియా కష్టాలు

ఆన్‌లైన్‌ విధానంతో తప్పని తిప్పలు

చౌడాపూర్‌లో దుకాణాలు ఉన్నా..

కుల్కచర్లకు పరుగు

ఇతరులకు ఇవ్వమంటున్న

అక్కడి వ్యాపారులు

దిక్కుతోచని స్థితిలో కర్షకులు

పొరుగు వారికి ఇవ్వం

మరికల్‌, చౌడాపూర్‌ ఎరువుల దుకాణంలో యూరియా లభించడం లేదు. దీంతో కుల్కచర్లకు వెళ్లాల్సి వస్తోంది. ఒక సంచి అయినా రానుపోను రవాణా ఖర్చులే అధికమవుతున్నాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసినా.. ఇతర ప్రాంతాల వారికి ఇవ్వమంటూ పొరుగు మండల వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. స్థానికంగా ఎరువు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

– శివకుమార్‌, యువరైతు, కల్మన్‌కాల్వ

ఇండెంట్‌ పంపించాం

చౌడాపూర్‌ మండలంలో రెండు ఎరువుల దుకాణాలు ఉన్నాయి. ఆ షాపుల్లో ఎరువు విక్రయించేందుకు ఇండెంట్‌ పంపించాం. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. సరిపడా యూరియా అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాం. త్వరలో వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

– పరిమళ, వ్యవసాయాధికారి,

చౌడపూర్‌ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement