యాలాల: మండల కేంద్రంలోని ఓ వైన్స్‌లో ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఎస్‌ఎల్‌వీ వైన్స్ పేరిట మద్యం దుకాణం ఉంది. శనివారం రాత్రి రోజు మాదిరిగానే వైన్స్ మూసేసిన నిర్వాహకులు ఆదివారం తెల్లవారుజామున దుకాణం తెరిచారు. షాపులోకి వెళ్లిన నిర్వాహకులకు పైకప్పు రేకుకు భారీ రంధ్రం ఉండడం చూసి చోరి జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో నగదు, వస్తువులను పరిశీలించగా సుమారు రూ.5వేల నగదుతో పాటు రెండు క్వార్టర్లు, ఒక వాటర్ బాటిల్ చోరీ అయినట్లు గుర్తించారు. కాగా షాపులో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందనే ఆశతో చొరబడిన దొంగలకు రూ.10 నోట్ల కట్ట మాత్రమే లభించింది. దీంతో విసుగు చెందిన దొంగలు రూ.5వేల వరకు ఉన్న రూ.10 రూపాయల నోట్ల కట్టతో పాటు రెండు క్వార్టర్ బాటిళ్లు, ఒక వాటర్ బాటిల్‌ను తీసుకొని వెళ్లిపోయారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వైన్స్ షాపు నిర్వాహకులు ఈ విషయాన్ని యాలాల పోలీసులకు తెలపడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ ఫుటేజీలో ఇద్దరు దొంగలు పైకప్పు రేకుకు రంద్రం వేసి లోపలికి వస్తున్నట్లు గుర్తించారు. గతేడాది జూలై 24న ఇక్కడ ఉన్న వైన్స్ షాపులో గోడకు రంద్రం వేసిన దొంగలు..రూ 40వేల నగదుతో పాటు నాలుగు ఫుల్ బాటిళ్లను ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఉంది.
రూ.5వేల నగదు,
రెండు క్వార్టర్ బాటిళ్లు అపహరణ


