● బాటసింగారంలో జోరు
● నిండిపోయిన పండ్ల రాశులు
● హుషారుగా క్రయవిక్రయాలు
అబ్దుల్లాపూర్‌మెట్: పండ్ల మార్కెట్‌కు మామిడి కళ వచ్చింది. పండ్ల సీజన్ ప్రారంభంతో విక్రయాలు జోరందుకున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డులో మామిడి క్రయవిక్రయాలతో కొన్ని రోజులుగా సందడి నెలకొంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్లో మామిడి క్రయ విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాది రూ. 300 కోట్ల వ్యాపారం జరిగిన విషయం తెలిసిందే.
క్యూ కట్టిన వాహనాలు
బాటసింగారం మార్కెట్‌లో మామిడి రాశులు నిండిపోయాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి మామిడి లోడ్లతో లారీలు, ట్రాలీలు పండ్ల మార్కెట్ బాట పట్టాయి. ఇప్పటివరకు సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల దిగుమతి కాగా, నాణ్యతనుబట్టి టన్నుకు సగటున రూ.35 వేల నుంచి రూ.40 వేల ధర పలుకుతోంది. ఈ సంవత్సరం సీజన్ ముగిసే సరికి సుమారు లక్షన్నర మెట్రిక్ టన్నులు మార్కెట్‌కు రానుందని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 20.90 వేల మెట్రిక్ టన్నుల విక్రయాలు జరినట్లు చెప్పారు.
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
బాటసింగారంలోని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌కు ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 11 రకాల మామిడి పండ్లు దిగుమతి అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. వీటిల్లో అత్యధిక ధర హిమాయత్ రకం కిలో రూ.200 ధర పలుకుతుండగా, అత్యల్పంగా నాటి రకం కిలో రూ.8–14 ధర పలుకుతోంది. వీటిలో చెట్టుపైనే కవర్ కట్టిన పండ్లకు అధిక డిమాండ్ ఉండడంతో పాటు ధర కూడా టన్నుకు రూ.లక్ష వరకు పలుకుతోందని అధికారులు పేర్కొంటున్నారు. 90 శాతం వరకు బెనిషన్ రకం పండ్లే ఎక్కువగా మార్కెట్‌కు వస్తోంది. కాగా ఇక్కడి మామిడి దేశంలోని రాజస్థాన్, పంజాబ్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో పాటు పరిసర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది.
మూడేళ్లుగా మార్కెట్‌కు వచ్చిన వివరాలు
2023–24లో 1.18 లక్షల టన్నులు
2024–25లో 1.11 లక్షల టన్నులు
2025–26లో 1.49 లక్షల టన్నులు


