చేవెళ్ల: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిని పరామర్శించారు. రంజిత్‌రెడ్డి తల్లి చంద్రకళ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో నగరంలోని వారి ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. చంద్రకళ చిత్రపటం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
డాక్టరేట్ ప్రదానం
షాద్‌నగర్ రూరల్: దేశ రాజధాని న్యూఢిల్లీలో వరల్డ్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రొటెక్షన్ కమిషన్ సభ్యుడిగా మ్యాగ్నెట్ విద్యాసంస్థల అధినేత ఎండీ వాజీద్ పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేసి సత్కరించారు.
యువతి అదృశ్యం
షాబాద్: ఓ యువతి అదృశ్యమైన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రమే ష్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన మేకల వెంకటయ్య కూతురు భావన (20) ఈ నెల 30న ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసింది. అర్ధరాత్రి తండ్రికి మెలకువ వచ్చి చూడగా కూతురు కనిపించలేదు. చుట్టు పక్కల, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు ఆమె ఒంటిపై పింక్ కలర్ టాప్, వైట్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపాడు. అదే గ్రామానికి చెందిన పసుల శ్రీకాంత్ అనే యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో ..
మొయినాబాద్‌రూరల్: యువతి అదృశ్యమైన సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌కు చెందిన తోక భార్గవి (19) ఈ నెల 30న ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పనికి వెళ్లిన తల్లి వచ్చి చూడగా కూతురు కనిపించకపోవడంతో బంధువులు, స్నేహితులు, చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


