● డ్రగ్స్‌కు బానిసలు కావొద్దు
● ఎస్పీ స్నేహ మెహ్ర
కొడంగల్: నేటి యువత దేశానికి వెన్నెముకలా వ్యవహరించాలని, యువశక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అరైవ్ –అలైన్, డ్రగ్స్ నివారణ అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. పలువురికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్రగ్స్ ఊబిలో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరా గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వివరాలు తెలిపిన వారి పేర్లు అత్యంత గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ప్రతిరోజూ ఉపాధి కోసం బయటకు వెళ్లే వ్యక్తులు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకోవడమే అర్రైవ్–అలైన్ ప్రాజక్టు ప్రధాన లక్ష్యమని అన్నారు. వాహనదారులు, డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయంలో కంటి చూపు స్పష్టంగా ఉండడం అత్యంత కీలకమన్నారు. డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. తద్వారా ప్రమాదాలు నివారించేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములునాయక్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ, ఎంవీఐ వసంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


