చైతన్యపురి: అప్పు వసూలు విషయంలో జరిగిన వివాదంలో ఒకరు మృతి చెందారు. చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. సతీష్ అనే వ్యక్తి జూబ్లిహిల్స్ మోతీనగర్‌లో ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. హోటల్‌లో సతీష్ స్నేహితులు ఎడ్ల యాదయ్య (30) తో పాటు మరో ఇద్దరు పనిచేస్తున్నారు. ఇటీవల యాదయ్య.. సతీష్ దగ్గరు రూ. 5 వేలు అప్పుగా తీసుకున్నాడు. తరువాత కొన్నాళ్లకు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా హోటల్‌లో పనిమాని వేసి చైతన్యపురిలోని హాస్టల్‌లో ఉంటున్నాడు. చైతన్యపురిలో ఉంటున్న విషయం తెలుసుకుని హోటల్‌లో పనిచేసే ఇద్దరు వర్కర్లతో కలిసి సతీష్ ఇక్కడకు వచ్చాడు. చైతన్యపురి మెట్రో స్టేషన్ వద్దకు యాదయ్యను పిలిపించి డబ్బుల కోసం గొడవ పెట్టుకున్నాడు. దీంతో మాటామాటా పెరిగి సతీష్ మరో ఇద్దరితో కలిసి యాదయ్యపై దాడి చేశారు. దీంతో స్ప ృహ తప్పి పడిపోయిన యాదయ్యను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సతీష్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తండ్రి కోటేశ్వరరావు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


