కడ్తాల్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. మండల కేంద్రంలో ఆదివారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతోందని తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని ప్రజలు ఆదరించి ఆశీర్వదించడమే దీనికి నిదర్శనమన్నారు. పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ పేద ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తోందని, అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని గుర్తు చేశారు. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లు గృహావసరాలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిందన్నారు. క్షేత్ర స్థాయిల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బాలరాజు, సేవాదళ్ మండల అధ్యక్షుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి


