మూసీ భూసేకరణ షురూ
3 మండలాలు, 14 గ్రామాల పరిధిలో సమీకరణ
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్ట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారికంగా భూసేకరణ ప్రారంభించింది. గండిపేట, రాజేంద్రనగర్, గోల్కొండ మండలాల్లోని 14 గ్రామాల పరిధిలో 55 ఎకరాల సమీకరణకుగాను భూయజమానులు, అపార్ట్‌మెంట్‌వాసులకు రెవెన్యూ విభాగం నోటీసులు జారీ చేసింది. ఫేజ్–1ఏలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ., ఫేజ్–1బీలో ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ. అభివృద్ధి చేయనుంది.
ఈ గ్రామాల నుంచే భూసేకరణ..
దర్గా కలిస్కాన్, కిస్మత్‌పూర్, హైదర్‌గూడ, బండ్లగూడ జాగీర్, బుద్వేల్, ఉప్పర్‌పల్లి, గండిపేట, నార్సింగి, మంచిరేవుల, ఇబ్రహీంబాగ్, గంధంగూడ, హైదర్షాకోట, బండ్లగూడ గ్రామాల్లో భూములను సమీకరించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్‌డీసీఎల్) నోటిఫికేషన్ జారీ చేసింది.
టీడీఆర్ రూపంలో పరిహారం..
భూనిర్వాసితులకు 200–400 శాతం భూ బదలాయింపు హక్కు(టీడీఆర్) రూపంలో ప్రభుత్వం పరిహారం అందజేయనుంది. గండిపేట నుంచి గౌరెల్లి వరకు దశలవారీగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల్లోని 14 మండలాలు, 46 గ్రామాల పరిధిలోని మూసీని సుందరంగా చేయనుంది. మూసీకి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా కేటాయించింది. నది సహజత్వాన్ని కాపాడుతూనే అర్బన్ ల్యాండ్ స్కేపింగ్‌ను అభివృద్ధి చేయనుంది.
10.34 ఎకరాల్లో గాంధీ సరోవర్..
గండిపేట మండలంలోని బండ్లగూడ జాగీర్‌లో 10.34 ఎకరాల విస్తీర్ణంలో గాంధీ సరోవర్‌ను అధికారులు అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సర్వే నంబరు 89, 90/2, 90/1లోని 10.34 ఎకరాల భూమిని సమీకరించనునున్నారు. ఇందులో 3.4 ఎకరాలు వక్ఫ్ బోర్డుది కాగా.. మిగతావి పట్టా భూములు. ఇందులో మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్లు కూడా ఉన్నాయి. రెండు బ్లాక్‌లు, ఒక్కోటి జీ+5 అంతస్తుల్లో కలిపి మొత్తం 410 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. భూసేకరణను వ్యతిరేకిస్తూ మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బ్లాక్–బీ ఓనర్స్ అసోసియేషన్ ఎంఆర్పీ ఫంక్షన్ హాల్‌లో సర్వసభ్య సమావేశం నిర్వహించింది. సమావేశంలో చట్టబద్ధమైన తమ భూమి/ఆస్తిని ఇచ్చేందుకు సిద్ధంగా లేమని సభ్యులందరూ ఏకగీవ్రంగా తీర్మానించారు. ప్రతిపాదిత భూసేకరణపై న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిపారు.
నోటీసులు జారీ చేసిన రెవెన్యూ విభాగం
వ్యతిరేకిస్తున్న మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌వాసులు
మొత్తం 55 ఎకరాల సేకరణకు రంగం సిద్ధం


