పడుతూ.. లేస్తూ.. బడికి!
● ఆర్టీసీ బస్సులు అంతంతే..
● ప్రైవేటు వాహనాలే దిక్కు
● విద్యార్థులకు తప్పని తిప్పలు
చేవెళ్ల: చదువుల కోసం విద్యార్థులు నానా పాట్లు పడుతున్నారు. నిత్యం పాఠశాలలకు వెళ్లేందుకు అటు సరైన రవాణా సదుపాయం లేక.. ఇటు రోడ్లు బాగాలేక అవస్థలు పడుతున్నారు. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలకు వెళ్లే వారితో బస్సులు రద్దీగా ఉంటున్నాయి. కొన్ని గ్రామాల్లో సమయానికి అనుకూలంగా లేకపోవడంతో ఉన్నా ఉపయోగం లేకుండా పోతోంది. మరికొన్ని గ్రామాలకై తే కనీసం బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థుల కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తున్నారు. మరికొంతమంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మండలంలో మొత్తం 25 పంచాయతీలు, 11 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. సగానికిపైగా పంచాయతీల్లో ఆటోలను నమ్ముకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఇక రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనాల్లో ప్రయాణం ఇబ్బందిగా మారింది. నిత్యం ఈ రోడ్లపై దుమ్ముధూళితో అవస్థలు పడుతున్నారు.
బస్సులు రాక.. బడికి వెళ్లలేక..
ధారూరు: పాఠశాలలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు రాక విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యం చింతకుంట, హరిదాస్‌పల్లి, అల్లీపూర్, అవుసుపల్లి, రుద్రారం, గట్టెపల్లి, రాంపూర్ తండా, స్టేషన్ ధారూరు నుంచి మండల కేంద్రమైన ధారూరులోని ప్రాథమికోన్నత పాఠశాలకు దాదాపు 20 మంది విద్యార్థులు వస్తుంటారు. చిన్నారులు ఎదుర్కొంటున్న బస్సు సమస్యలపై గురువారం శ్రీసాక్షిశ్రీ పరిశీలించగా పలు విషయాలు వెలుగు చూశాయి. ఉదయం అష్టకష్టాలు పడి స్కూల్‌కి వెళ్లిన రాంపూర్‌తండా విద్యార్థులు.. సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత ధారూరు చౌరస్తాలో బస్సుల కోసం దాదాపు గంట సేపు నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా బస్సు రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో గ్రామానికి వెళ్లారు. మరి కొందరు ద్విచక్ర వాహనదారులను లిఫ్ట్ అడిగి వెళ్లారు. అంతకుముందు విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రతి రోజూ బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు. ఒక్కోసారి చీకటి పడిన తర్వాత గ్రామానికి చేరుకోవాల్సి వస్తోందన్నారు. కొన్ని సందర్భాల్లో బస్సులు వచ్చినా పాయింట్ వద్ద ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ధారూరు: చౌరస్తాలో బస్సుల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు
చేవెళ్ల: ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్న విద్యార్థులు
పడుతూ.. లేస్తూ.. బడికి!


