అన్ని వసతులతో డబుల్ బెడ్రూం ఇళ్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్రూం ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం ఆదేశించారు. గురవారం కర్మన్‌ఘాట్ నందనవనం కాలనీ, మల్లాపూర్, కుర్మలగూడ, బాటసింగారం, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఇళ్ల పనులను పరిశీలించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాల, వైద్య సదుపాయాలు, పార్కుల వంటివి కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కాలనీల్లో జీవనప్రమాణాలతో నివసించేందుకు వీలుగా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు ఉండాలన్నారు. వచ్చే రెండు నెలల్లో లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నందనవనంలో పునరావాసంలో భాగంగా నిర్మించిన 2 బీహెచ్‌కే 80 (2బ్లాక్‌లను) ఫ్లాట్లను ఆయన పరిశీలించారు. పూర్తయిన ఇళ్లను వారం రోజుల్లో లాటరీ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులకు అందించాలని సూచించారు. తర్వాత మల్లాపూర్‌లో నిర్మాణంలో ఉన్న 17 బ్లాక్‌ల్లో పనులను సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్‌లోని భూములు కబ్జా కాకుండా చర్యలు చేపట్టాలని, హైడ్రా అధికారుల సహాయం తీసుకోవాలని స్థానిక తహసీల్దార్‌ను ఆదేశించారు. సెప్టెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి కావాల్సిందే అని స్పష్టం చేస్తూ, అందుకు తగ్గట్లుగా పనులన్నిటినీ ప్రణాళిక బద్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కుర్మల్‌గూడలో పూర్తి కావస్తు న్న 1,536 ఫ్లాట్స్ పనులను పరిశీలించి, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల పనులను మార్చి నాటికి పూర్తి చేయాలన్నారు. బాటసింగారంలోని 20 బ్లాక్‌ల నిర్మాణాలను చూసి పనులను వేగవంతంగా చేయాలని సూచించారు. అబ్దుల్లాపూర్ మెట్‌లో ఖాళీగా ఉన్న ఇళ్లను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఎం.చైతన్య కుమార్, పి.బలరాం, జి.విజయకుమార్, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డి.చంప్లానాయక్ జీహెచ్‌ఎంసీ అధికారులు పి.వి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


