గురుకులాల్లో పీజీ వరకు ఉచిత విద్య
యాచారం: రాష్ట్రంలోని గురుకులాల్లో పేద విద్యార్థులకు ఐదో తరగతి నుంచి పీజీ వరకు వసతితో కూడిన ఉచిత విద్య అందిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ జాయింట్ సెక్రటరీ బి.సక్రునాయక్ పేర్కొన్నారు. టీజీ సెట్ అడ్మిషన్లపై గురువారం తాడిపర్తి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1,023 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు ఉన్నట్టు తెలిపారు. వీటిలో ఏటా 55 వేల వరకు ఐదో తరగతిలో అడ్మిషన్లు జరుగుతున్నాయని అన్నారు. గురుకులాల్లో ఖాళీ సీట్ల కోసం ఈనెల 25 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకులాల్లో ఐదో నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. టీజీ సెట్ ద్వారా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారి నిర్మల, సర్పంచ్ నీలం ఝాన్సీ, ఉప సర్పంచ్ రమేష్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు లీలావతి, రామయ్య, నాగేశ్వర్‌రావు, శ్రీనివాస్, సీనియర్ ఫ్యాకల్టీ పాల్గొన్నారు.


