బలవంతపు భూ సేకరణ సహించం
షాబాద్: దళిత రైతుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. రేగడిదోస్వాడలో గురువారం నిర్వహించిన రైతు మహాధర్నాకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ల్యాండ్ పూలింగ్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా పేదల భూములను లాక్కుంటోందని ఆరోపించారు. దళితుల భూములు ఎందుకోసం తీసుకుంటున్నారో.. ఏం కంపెనీలు పెడతారో.. ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పకుండా ఆక్రమించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాబాద్ మండలం రేగడిదోస్వాడ, తాళ్లపల్లి, మక్తగూడ, తిమ్మారెడ్డిగూడ, వెంకమ్మగూడ గ్రామాలకు చెందిన దళిత రైతుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడాన్ని వ్యతిరేకించారు. ఈశా ఫౌండేషన్ కోసం భూములు ఇవ్వడానికి పేదల భూములే దొరికాయా, ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలు కేటాయించవచ్చు కదా అని నిలదీశారు. చేవెళ్ల సాక్షిగా మల్లికార్జునఖర్గే సమక్షంలో పేదల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక లగచర్లలో అల్లుడి ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమిని లాక్కోవాలని చూశారని గుర్తు చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి పేదలకు న్యాయం జరిగేదాక పోరాడతామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు విజయ ఆర్య క్షత్రియ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, దేశమల్ల ఆంజనేయులు, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచ్‌లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్


