వేగంగా ఇంటిగ్రేటెడ్!
● కొందుర్గులో యంగ్ ఇండియారెసిడెన్షియల్ పాఠశాల
● కొనసాగుతున్న భవన నిర్మాణ పనులు
● అన్ని వర్గాలకు ఒకేచోట విద్యాబోధన
షాద్‌నగర్: పల్లె ప్రకృతి ఒడిలో.. చదువుల కోవెలను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక వసతులతో కూడిన గురుకులానికి సీఎం రేవంత్‌రెడ్డి షాద్‌నగర్ పరిధిలోని కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి.
రూ.150 కోట్లతో నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కొందుర్గు తూర్పు శివారులోని సర్వే నంబర్ 109లో సుమారు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీనికి 2024 అక్టోబర్ 11న సీఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ చేశారు. భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భవన నిర్మాణం చేపట్టే స్థలాన్ని చదును చేసి 10 ఎకరాల విస్తీర్ణంలో పునాదులను బేస్‌మెంట్ లెవల్ వరకు పిల్లర్లు పూర్తి చేశారు. మిగితా సెంట్రింగ్ పనులు కొనసాగుతున్నాయి. పనులు చురుకుగా చేపట్టేందుకు నిర్మాణం చేస్తున్న ప్రదేశంలోనే రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణం పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేస్తున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో..
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రతి నియోజకవర్గంలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాలమైన ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదులే కాకుండా అంతర్జాతీయ స్కూల్స్‌తో సమానంగా భవనాన్ని నిర్మిస్తున్నారు. విద్యార్థులకు ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధనతో విద్యనభ్యసించుతారు. సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు నాణ్యమైన బోధన అందనుంది.
నాణ్యమైన విద్య
ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలో అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన విద్య అందుతుంది. ఈ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించి సూచనలు ఇస్తున్నా.
– వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్‌నగర్


