ఎకరాకు రూ.30 లక్షల పరిహారం
కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న మండలంలోని ముద్వీన్ రెవెన్యూ పరిధిలోని ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల భూ నిర్వాసితులు కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ నారాయణరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూ బాధితులు పరిహారానికి సంబంధించి తమ డిమాండ్లను కలెక్టర్‌కు విన్నవించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి స్పందిస్తూ.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు ప్రభుత్వం అందించే ప్యాకేజీని ప్రకటించారు. ఎకరాకు రూ.30 లక్షల నగదు పరిహారంతో పాటు, భూములు కోల్పోతున్న రైతులకు మైసిగండి గ్రామ సమీపంలో 120 గజాల ఇంటి స్థలం కేటాయిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని కూడా నిర్మిస్తామని చెప్పారు. అదే విధంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు ఒక్కోక్కరికి రూ.ఐదు లక్షల చొప్పున అదనపు సాయం అందిస్తామని వివరించారు.
రోడ్డు బాగు చేయించండి సారూ
అనంతరం మర్రిపల్లి నుంచి ఆమనగల్లు మండలం కోనాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారి, ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మర్రిపల్లి సర్పంచ్ ఈర్లపల్లి రవి కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ రోడ్డును త్వరితగతిన మరమ్మతులు చేయించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. సమావేశంలో భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు, భూ నిర్వాసితులు వీరయ్య, పెద్దయ్య, రంగారెడ్డి, శంకర్, శివ, వెంకటయ్య, శ్రీనయ్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూ బాధితులకు కలెక్టర్ హామీ


