క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు
అబ్దుల్లాపూర్‌మెట్: స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుకుంటున్న ఓ యువకుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన మండలంలోని కవాడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండారి సురేశ్(31) ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 3వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. గురువారం స్నేహితులతో కలిసి ఆయన కుంట్లూర్‌లోని ఓ క్రీడా మైదానంలో సరదాగా క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతని స్నేహితులు పక్కన కూర్చోపెట్టి విశ్రాంతి తీసుకోమన్నారు. అనంతరం కవాడిపల్లిలోని అతని ఇంటికి తీసుకువచ్చారు. అప్పటివరకూ బాగానే ఉన్న సురేశ్ మరోసారి అస్వస్థతలకు గురికావడంతో స్థానికులు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు ఏడాది క్రితమే వివాహం అయింది. యువ నాయకుడు గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తీవ్ర అస్వస్థతతో వార్డు సభ్యుడి మృతి


