సురక్షిత ప్రయాణానికే ‘అరైవ్–అలైవ్’
చేవెళ్ల: సురక్షిత ప్రయాణానికే పోలీస్ శాఖ ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం చేపట్టిందని చేవెళ్ల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉపాధ్యాయ విజయ్‌కుమార్, తహసీల్దార్ కృష్ణయ్య అన్నారు. బుధవారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చేవెళ్ల కోర్టు, ప్రభుత్వ ఆస్పత్రి, తహసీల్దార్ కార్యాలయం వద్ద అరైవ్–అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి పూలు, పెన్నులు ఇస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, ఎస్‌ఐ శిరీష, పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు మెరుగైన పరిహారం
● నాగిరెడ్డిపల్లి బాధితులకు ఎకరాకు రూ.1.20 కోట్లు
● కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి
మహేశ్వరం: ఐటీ పార్కు ఏర్పాటులో భూములు కోల్పోతున్న నాగిరెడ్డిపల్లి రైతులకు ఎకరాకు రూ.1.20 కోట్లతో పాటు 121 గజాల ప్లాటును పరిహారంగా అందజేస్తామని ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గ్రామంలో బాధిత రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహేశ్వరం మండల పరిధిలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 9, 10, 48, 49, 50, 51, 53, 54, 63, 66, 110, 144, 162, 163 సర్వే నంబర్లలో 195.5 ఎకరాల సీలింగ్ భూమిని సేకరిస్తున్నామని చెప్పారు. పరిహారం నేరుగా రైతుల ఖాతాలో జమచేస్తామన్నారు. ఇప్పటికే పలువురు రైతులు అంగీకారం తెలుపుతూ పత్రాలు అందజేశారని.. మిగిలిన రైతులు అందజేస్తే పరిహారం అందజేస్తామన్నారు. కాగా రైతులు పరిహారం పెంచాలని కోరగా.. ఇప్పటికే మూడింతల కంటే ఎక్కువ పరిహారం అంజేస్తున్నామని.. పెంచేందుకు వీలులేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం తహసీల్దార్ చిన్న అప్పల నాయుడు, మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్వర్ణకుమారి, జీపీఓ స్వప్న, సర్పంచ్ బామిని నాయక్, ఉప సర్పంచ్ జగన్, మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు రైతులు పాల్గొన్నారు.
జీపీఓఏటీజీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భాస్కర్
మంచాల: గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ(జీపీఓఏటీజీ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యాట భాస్కర్ నియమితులైనట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాపాలకు చెందిన ఆయన యాచారం తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. అవకాశం కల్పించిన సంఘం రాష్ట్ర, జిల్లా బాధ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సురక్షిత ప్రయాణానికే ‘అరైవ్–అలైవ్’


