మల్బరీ సాగుతో సుస్థిర ఆదాయం
ఆమనగల్లు: రైతులు సంప్రదాయ పంటలతో పాటు మల్బరీ సాగు చేసి ఏడాది పొడవునా సుస్థిర ఆధాయం పొందవచ్చని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. తలకొండపల్లి మండలం కోరింతకుంటతండాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన పట్టు పరిశ్రమ రిసోర్స్ సెంటర్‌ను బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పండ్ల తోటలు, కూరగాయలు, పట్టు పరిశ్రమ, ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యాన, మల్బరీ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సబ్సిడీలు అందిస్తున్నాయని చెప్పారు. వీటిని వినియోగించుకుని రైతులు మల్బరీ సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఆరుతడి పంటలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. పట్టుసాగుతో స్వల్ప కాలంలో దిగుబడి చేతికి వస్తుందని, మార్కెటింగ్‌కు ఇబ్బందులు ఉండవని ఆమె సూచించారు. పట్టుసాగుపై జిల్లాలో ఇటీవల రైతులు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత, జిల్లా అధికారి సురేశ్, ఏడీ నాగరత్నం, రిసోర్స్ సెంటర్ నిర్వాహకుడు సక్రునాయక్, అధికారులు హిమబిందు, సౌమ్య పాల్గొన్నారు.
రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా


