మాంసాహార జంతువుల గణన
వివరాలు సేకరిస్తున్న అటవీశాఖ అధికారులు
యాచారం: ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్‌లో భాగంగా బుధవారం గునుగల్ అటవీ ప్రాంతంలో సర్వే నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని గునుగల్, ఇబ్రహీంపట్నం అటవీ ప్రాంతాల్లో రెంజ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, యాచారం సెక్షన్ అధికారి నర్సింహల సమక్షంలో సర్వే చేపట్టారు. 21, 22 తేదీల్లో మాంసాహార జంతువుల సర్వే, 23, 24, 25 తేదీల్లో శాఖహార జంతువుల సర్వే చేపడుతామని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో ఏఏ జంతువులు సంచరిస్తున్నాయి. వాటి సంరక్షణ ఎలా ఉంది, ఇబ్బందులేమైన పడుతున్నాయా, రక్షణ చర్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సర్వే చేపడుతున్నారు. అటవీ ప్రాంతంలో మొత్తం జంతువుల సర్వే గణన చేపడుతామని జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్‌రెడ్డి తెలిపారు. శ్రీశైలం, మన్నానూర్ అటవీ ప్రాంతాలు.. రంగారెడ్డి జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాలకు లింకు ఉండడంతో చిరుత పులులేమైనా వచ్చాయా అని ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 28,627 హెక్టార్లు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో జంతువుల సర్వే గణన జరుపుతామని ఆయన వివరించారు.
ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్‌లో..
చేవెళ్ల: జీవ వైవిధ్యాన్ని, అడవుల పరిరక్షణ లక్ష్యాలను అంచనా వేసేందుకు ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్‌లో భాగంగా సర్వే చేపడుతున్నట్లు చిలుకూరు–ముడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మణ్ అన్నారు. మండల పరిధిలోని ముడిమ్యాల ఫారెస్ట్‌లో బుధవారం మాంసాహార జంతువుల గణన చేపట్టారు. మూడు రోజులు చొప్పున లైన్ ట్రాంజెక్ట్, ట్రయల్ పాత్ సర్వే చేస్తూ డాటాను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ వివరాలు సేకరించి నివేదికను ఫారెస్ట్ ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి రవికుమార్, ఫారెస్ట్ వాచర్ విజయ్ పాల్గొన్నారు.


