మా గ్రామంలో బెల్టుషాపులు వద్దు
కొందుర్గులో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామస్తులు
కొందుర్గు: మండల కేంద్రమైన కొందుర్గులో బెల్టు దుకాణాల తొలగింపునకు గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చౌడపురం ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని కాలనీల్లో కిరాణ దుకాణాల్లో మద్యం విక్రయిస్తున్నారని, వాటిని తొలగించాలని గ్రామస్తులు కోరారు. బెల్టు షాపుల రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో బెల్టు దుకాణాలు తొలగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం వైన్స్ షాపులకు వెళ్లి బెల్టు దుకాణాలకు మద్యం విక్రయించవద్దని సూచించారు. అనంతరం తహసీల్దార్ ఆజాం అలీకి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేఖ, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


