ఇళ్ల నిర్మాణం డల్
న్యూస్‌రీల్
వెయిటింగ్‌లో ఉన్నవారికి..
గురువారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నిర్మాణ ఖర్చులు ఇందిరమ్మ ఇళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరిగిన మేసీ్త్ర కూలీలు, స్టీలు, సిమెంట్, ఇసుక ధరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముందరి కాళ్లకు బంధనాలు వేస్తున్నాయి. ఫలితంగా నిర్మాణాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నుంచి ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారుల్లో ఇప్పటికీ పలువురు ముగ్గు కూడా పోయలేదు. మెజార్టీ నిర్మాణాలు బేస్మెట్ లెవల్ కూడా దాటలేదు. ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయానికి.. క్షేత్రస్థాయిలో ఖర్చులకు పొంతన ఉండడం లేదు. దీంతో మెజార్టీ లబ్ధిదారులు చేపట్టిన నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు వెనుకాడుతున్నారు. ప్రభుత్వం జిల్లాకు మొత్తం 17,675 ఇళ్లు కేటాయించగా, వీటిలో 15,543 ఇళ్లు మంజూరు చేసింది. 13,193 ఇళ్లకు మార్కింగ్ చేసి, ఆన్‌లైన్ ట్యాగింగ్ ప్రక్రియ సైతం పూర్తి చేశారు. కాగా పెరిగిన ధరలకు భయపడి ఇప్పటి వరకు 2,350 మంది ముగ్గు కూడా పోయలేదు. 10,327 నిర్మాణాలు ఇప్పటికీ బేస్మెట్ లెవల్లోనే నిలిచిపోయాయి. కేవలం 355 మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు పూర్తి చేశారు.
నిర్మాణాలకు వెనుకడుగు
● చేవెళ్ల నియోజకవర్గానికి 2,800 ఇళ్లు కేటాయించగా, వీటిలో 2,491 ఇళ్లకు పరిపాలనా పరమైన అనుమతులు లభించాయి. నియోజకవర్గంలోని చేవెళ్ల, నార్సింగి, శంకర్‌పల్లి మున్సిపాలిటీలు సహా జన్వాడ, మిర్జాగూడలో 650 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో 132 మంది లబ్ధిదారులు ఇప్పటికీ ముగ్గు పోయలేదు. 106 ఇళ్లు బేస్మెట్ లెవల్లోనే ఉన్నాయి. ఇదే నియోజకవర్గం పరిధిలోని గ్రామ పంచాయతీల్లో 2,150 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో 225 మంది లబ్ధిదారులు ముగ్గు పోయలేదు. మరో 338 నిర్మాణాలు బేస్మెట్ లెవల్ కూడా దాటలేదు.
● ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, వీటిలో 3,397 మంజూరయ్యా యి. ఆదిభట్ల, పెద్ద అంబర్‌పేట్, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల పరిధిలో 1,748 ఇళ్లు కేటాయించగా, మిగిలిన 1,752 ఇళ్లను గ్రామీణ ప్రాంతాలకు కేటాయించారు. వీటిలో 533 మంది లబ్ధిదారులు ముగ్గు కూడా పోయలేదు. 688 ఇళ్లు ఇప్పటికీ బేస్మెట్ స్థాయి దాటలేదు.
● కల్వకుర్తి నియోజకవర్గానికి 2,385 ఇళ్లు కేటాయించగా, 2180 మంజూరయ్యాయి. ఆమనగల్లు మున్సిపాలిటీకి 360 ఇళ్లు కేటాయించగా, మిగిలినవి రూరల్ ఏరియాలకు కేటాయించారు. ఇప్పటి వరకు ఇక్కడ 209 మంది ఇంకా ముగ్గు పోయలేదు. 437 నిర్మాణాలు కనీసం బేస్మెట్ లెవల్ దాటలేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
● మహేశ్వరం నియోజకవర్గానికి 3,390 ఇళ్లు కేటాయించగా, వీటిలో 3,205 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. బడంగ్‌పేట్, జల్‌పల్లి, మీర్‌పేట్, తుక్కుగూడ మున్సిపాలిటీలకు 1,018 ఇళ్లు కేటాయించగా, 862 ఇళ్లు మంజూరయ్యాయి. ఇక్కడ ఇప్పటి వరకు 836 మంది ముగ్గు కూడా పోయలేదు. 390 నిర్మాణాలు బేస్మెట్ దాటలేదు.
● రాజేంద్రనగర్ నియోజకవర్గానికి 2,100 కేటాయించగా, వీటిలో 1,001 ఇళ్లకు మాత్రమే అనుమతులు లభించాయి. ప్రొసీడింగ్స్ అందుకున్న వారిలో 42 మంది ఇప్పటికీ ముగ్గు పోయలేదు. మరో 251 నిర్మాణాలు బేస్మెట్ కూడా దాటలేదు. ఇప్పటి వరకు ఇక్కడ 31 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.
● షాద్‌నగర్ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, 3,269 మాత్రమే మంజూరయ్యాయి. 285 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు ముగ్గు కూడా పోయలేదు. 712 నిర్మాణాలు బేస్మెట్ స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 35 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి.
పెరిగిన ముడిసరుకు ధరలతో పురోగతి నిల్
ఇప్పటికీ ముగ్గుపోయని 2,350 మంది లబ్ధిదారులు
10,327 నిర్మాణాలు బేస్మెట్‌కే పరిమితం
ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు చెల్లిస్తుంది. ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటికే రూ.250 కోట్లకుపైగా జమ చేసింది. కుటుంబ సభ్యులు చనిపోయి కొంత మంది, స్థల వివాదాలతో మరికొంత మంది లబ్ధిదారులు పనులు ప్రారంభించలేదు. ఇలాంటి వారిని గుర్తించి ఒత్తిడి తీసుకొస్తున్నాం. అయినా నిరాకరిస్తే వారి ప్రొసీడింగ్స్ రద్దు చేసి, వెయిటింగ్ జాబితాలో ఉన్నవారికి కేటాయిస్తున్నాం. ఆర్థిక స్థోమత లేని పేదలకు మహిళా పొదుపు సంఘాల నుంచి లోన్లు ఇప్పిస్తున్నాం. ఇసుక, ఇటుక, స్టీలు, సిమెంట్ సమస్య లేదు. ప్రభుత్వమే ఇసుక యార్డులను నిర్వహిస్తోంది. లబ్ధిదారులు కోరిన వెంటనే సరఫరా చేస్తుంది. 600 చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి నిర్మించే ఇళ్లకు ప్రభుత్వ ఆర్థిక సహాయం నిలిపివేస్తున్నాం.
– చంప్లానాయక్, పీడీ, హౌసింగ్


