ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఫౌండేషన్ కోర్సు
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకులు రామారావు
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు నెలల పాటు నిర్వహించే ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకులు రామారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ నిర్వహించే 2025–26కు గాను స్టేట్ సర్వీసెస్, కానిస్టేబుల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు, స్టడీ మెటీరియల్స్ అందజేస్తామన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో స్టడీ సర్కిల్ నుంచి కోచింగ్ తీసుకున్నవారు అనర్హులని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 8న అర్హత పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు ఎల్.వెంకటయ్య హనరరీ డైరెక్టర్, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నంబర్ 94405 21419లో సంప్రదించాలన్నారు.
27న హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు
షాద్‌నగర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం బోధించేందుకు గెస్ట్ లెక్చరర్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు రసాయన శాస్త్రంలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. పీహెచ్‌డీ, ఎన్‌ఈటీ, ఎస్‌ఈటీ, ఎస్‌ఎల్‌ఈటీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 24 తేదీ లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. హయత్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా జాకీర్ అహ్మద్
మొయినాబాద్: మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా జాకీర్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఆయన బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
ఖాజా మొయిజుద్దీన్ బైంసాకు బదిలీ
మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఖాజా మొయిజుద్దీన్ నిర్మల్ జిల్లా బైంసాకు బదిలీ అయ్యారు. నూతన మున్సిపాలిటీకి తొలి కమిషనర్‌కు వచ్చిన ఆయన ఏడాదిలోనే వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్నారు. ఆగస్టు 15న వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేయకపోవడంతో చిలుకూరు వాసులు ఆయన్ను నిలదీశారు. స్థానికులపై ఆయన దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన ప్రజలు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేయడంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల పెద్దమంగళారం రెవెన్యూలో గిరిజనుల ఇళ్ల కూల్చివేతలోనూ ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలను ఎదుర్కొన్నారు.
డీసీ త్రిల్లేశ్వర్‌రావు డీసీఎంఏ కార్యాలయానికి..
బడంగ్‌పేట్: సర్కిల్–16కు డీసీగా వ్యవహరిస్తున్న త్రిల్లేశ్వర్‌రావును బుధవారం సీడీఎంఏ కార్యాలయానికి బదిలీ చేశారు. జీహెచ్‌ఎంసీలో బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్లను బడంగ్‌పేట సర్కిల్–16 పేరుతో ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇక్కడ మొదటి డిప్యూటీ కమిషనర్‌గా వచ్చిన త్రిల్లేశ్వర్‌రావు బడంగ్‌పేట కమిషనర్‌గా ఉన్న సమయంలో అవినీతి మరకలు ఉన్నాయి. ఆయన బదిలీపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్‌ఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
పట్నంకు సుదర్శన్
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణరెడ్డి బుధవారం పదోన్నతిపై జీహెచ్‌ఎంసీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో దేవరకొండ మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ ఇక్కడికి రానున్నారు.
ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఫౌండేషన్ కోర్సు


