వసంత పంచమికి ఏర్పాట్లు
● ముస్తాబైన జ్ఞాన సరస్వతి ఆలయం
● రేపు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామిజీ చేతులమీదుగా సామూహిక అక్షరాభ్యాసం
యాచారం: నందివనపర్తిలోని జ్ఞాన సరస్వతి ఆలయం వసంత పంచమి వేడుకలకు ముస్తాబైంది. అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఇక్కడ శ్రీ పంచమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను శ్రీ జ్ఞాన సరస్వతి సేవా సమితి ట్రస్ట్, జ్ఞాన సరస్వతి సంస్థాన్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త సదా వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో నిర్వహిస్తారు. ఆలయ పూజారి రాఘవేంద్రశర్మ నిర్వహించే ఈ పూజలకు యువత స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఉదయం హోమం.. రాత్రి పల్లకీసేవ
జ్ఞాన సరస్వతి ఆలయ ఆవరణలో రేపు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నారు. హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ చిన్నారులతో అక్షరాలు దిద్దించి దీవెనలు అందించనున్నారు. జిల్లా వాసులతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్ తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అక్షరాభ్యాసానికి కావాలల్సిన పలక, బలపం, అమ్మవారి ఫొటో, ప్రసాదం ఆలయ కమిటీ అందజేస్తుంది. చిన్నారుల తల్లితండ్రులు తమలపాకులు, పూలు, పండ్లు, కుడక, 1.25 కేజీల బియ్యం, పసుపు, కుంకుమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యార్థులచే శ్రీ సరస్వతి హోమంరాత్రి ఏడు గంటల నుంచి పదో తరగతి విద్యార్థులతో అమ్మవారి పల్లకీ సేవ ఉంటుంది. అక్షరాభ్యాసం ఉంటే ఉదయం ఎనిమిది గంటల లోపే ఆలయానికి చేరుకోవాలని ఆలయ ధర్మకర్త సదా వెంకట్‌రెడ్డి తెలిపారు.
వసంత పంచమికి ఏర్పాట్లు


