రూ.10 లక్షలు మింగేశారు
బడంగ్‌పేట్: పేద విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేటాయించిన పీఎం స్కీం నిధులు మాయమవుతున్నాయి. విద్యార్థుల అభివృద్ధికి కేటాయించిన రూ.10లక్షల నిధులను స్వాహా చేసి తప్పుడు బిల్లులు సృష్టించి ఆడిట్‌కు వచ్చిన వారిని సైతం బోల్తా కొట్టించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. ఇది గమనించిన ఓ ఉపాధ్యాయుడు సోమవారం ఆధారాలతో సహా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది.
విద్యార్థులను టూర్‌కు తీసుకెళ్లామని..
బడంగ్‌పేట జెడ్పీహెచ్‌ఎస్‌లో గత ఏడాది గుర్రం జగదీశ్వర్‌రెడ్డి ఎఫ్‌ఏసీ హెచ్‌ఎంగా పనిచేశారు. (ప్రస్తుతం తుప్రాన్‌పేటలో జీహెచ్‌ఎం) ఇదే పాఠశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడి సహకారంతో పీఎం శ్రీ నిధుల గోల్‌మాల్‌కు పథకం వేశాడు. గ్రీన్ స్కూల్ క్షేత్ర పర్యటన పేరుతో విద్యార్థులను కాలేశ్వరం టూర్‌కు తీసుకు వెళ్లామని.. అందుకు స్నాక్స్‌కు, చిలుకూరు ఉస్సేన్ ట్రావెల్స్‌కు, పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించామని, సైన్స్ ఫెయిర్‌లు ఏర్పాటు చేశామని ఇలా తప్పుడు పత్రాలు జత చేసి రూ.10లక్షలు కాజేశారు. కాగా విద్యార్థులను లక్నవరం వంతెన, జూపార్కు క్షేత్ర పర్యటన తీసుకెళ్తామని ఒక్కో విద్యార్థి నుంచి రూ.500 నుంచి రూ.వేయి వరకు వసూలుచేశారు. కాగా జగదీశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేసి ఖాజేసిన నిధులు రాబట్టాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
‘పీఎం శ్రీ’నిధులు కాజేసిన ప్రధానోపాధ్యాయుడు
క్షేత్రపర్యటన పేరిట తప్పుడు రసీదులు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బడంగ్‌పేట్ జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు
హెచ్‌ఎం జగదీశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్


