‘ఉపాధి’ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
కడ్తాల్: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని వీబీ జీ రామ్ జీ గాపేరు మార్చడాన్ని నిరసిస్తూ బుధవారం మండల పరిధిలోని చరికొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు 20 ఏళ్ల క్రితం ప్రధాని మన్మోహన్‌సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. గాంధీజీ ప్రతిష్టను దెబ్బతీసేందకు బీజేపీ ఇష్టారాజ్యంగా పేరుమార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త చట్టంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం నిధులు కేటాయించాలనే నిబంధనను తీసుకువచ్చి పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. పేదల పక్షాన కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్, ఏఎంసీ చైర్‌పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు మహేందర్‌గౌడ్, కరుణాకర్‌గౌడ్, రవి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికాంత్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాములుగౌడ్, వెంకటయ్యగౌడ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి


