ఆలయానికి స్థలం కేటాయించండి
మొయినాబాద్: అయ్యప్ప ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని మండలంలోని పెద్దమంగళారం గ్రామస్తులు, అయ్యప్ప భక్తులు తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌కు విన్నవించారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం సర్వే నంబర్ 218 ప్రభుత్వ భూమిలో అయ్యప్ప దేవాలయం నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మంగళవారం స్థానికులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నరోత్తంరెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, వీరారెడ్డి, ఓంరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, అయ్యప్ప భక్తులు ఉన్నారు.
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, సెంటర్ ఫర్ నాలెడ్జ్, కల్చర్ అండ్ ఇన్నోవేషన్ స్టడీస్ అధిపతి ప్రొఫెసర్ సి.రాఘవరెడ్డికి అరుదైన అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా(ఎన్‌ఐఎఫ్) కొత్త ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అండ్ పబ్లిక్ పాలసీ సలహా కమిటీ సభ్యుడిగా ఆయనను నియమించింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలోని ఎన్‌ఐఎఫ్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాజ ఇంటర్‌ఫేస్‌లు, సమ్మిళిత అభివృద్ధికి సంబంధించిన సంస్థాగత విధానాల్లో ప్రొఫెసర్ రాఘవరెడ్డి నైపుణ్యాన్ని గుర్తించి ఈ అవకాశం కల్పించింది. కమిటీ చైర్మన్‌గా జేఎన్‌యూ ప్రొఫెసర్ మాధవ్ గోవింద్‌ని, సభ్యులుగా రాఘవరెడ్డిసహా ఆరుగురిని నియమించింది.
హేట్ స్పీచ్ చట్టం తేస్తామనడం తగదు
హిందూ లాయర్స్ ఫోరం
పంజగుట్ట: రాష్ట్రంలో హేట్ స్పీచ్ బిల్లును తీసుకువస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించడం రాజ్యాంగం, ప్రజాస్వామిక పాలనకు విరుద్ధమని హిందూ లాయర్స్ ఫోరం పేర్కొంది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరం ప్రతినిధులు శివ స్వామి, రాధా మనోహార్ స్వామీజీ మాట్లాడుతూ సీఎం ఒక వర్గంవారిని సంతృప్తి పరిచేందుకే ఆ ప్రకటన చేశారని, ఈ బిల్లు వల్ల వర్గాల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. హేట్ స్పీచ్‌పై బీఎన్‌ఎస్ చట్టంలో ఇప్పటికే సెక్షన్‌లు ఉన్నాయని అన్నారు. సమావేశంలో ఫోరం బాధ్యులు, హైకోర్టు న్యాయవాదులు శ్రీకృష్ణ, గోశాల శ్రీనివాస్, కె.భానుచంద్ర, భరద్వాజిని పాల్గొన్నారు.
‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’పై శిక్షణ
ఏజీ వర్సిటీ: పీవీ నర్సింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయంలోని క్షేత్రస్థాయి పశువైద్యులకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, యాంటీ బయోటిక్ మందుల వినియోగంపై రెండు రోజుల శిక్షణను మంగళవారం వీసీ జ్ఞాన ప్రకాశ్ ప్రారంభించారు. సద్గురు ఫౌండేషన్, జెనెక్స్ యానిమల్ హెల్త్ ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు(ఏడీబీ) సహకారంతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జ్ఞాన ప్రకాశ్ మాట్లాడుతూ పశువులకు అవసరం లేకున్నా మోతాదుకు మించి యాంటీబయోటిక్ మందులు ఇవ్వడం సరికాదని, దీని వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని అన్నారు. విస్తరణ సంచాలకుడు డాక్టర్ కిషన్‌కూమార్ మాట్లాడుతూ పశువైద్యులు సరియైన చిక్సితా విధానాలను అవలంబిస్తేనే పశువుల ఆరోగ్యం నియంత్రణలో ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల అసోసియెట్ డీన్ మాధూరి, డాక్టర్ గోపాల్, సత్యనారాయణ, ఎం.సోనాలి తదితరులు పాల్గొన్నారు.
చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి
కుత్బుల్లాపూర్: బైక్ అదుపుతప్పి చెట్టును డీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన మేరకు.. రాజన్న సిరిసిల్ల జిల్లా సత్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన అక్కినపల్లి సుజీత్(22) మైసమ్మగూడలో ఉంటున్నాడు. మంగళవారం మైసమ్మగూడ నుండి స్నేహితుడు చంద్రారెడ్డితో కలిసి మరో స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్నాడు. ఈ క్రమంలో అపెరల్ రోడ్డులో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. బైక్ వెనుక కూర్చున్న సుజిత్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు.


