రసీదు ఇచ్చి.. శాంతపరిచి
మంచాల: గ్రామాల్లో ఓ వైపు వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. మరో వైపు యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు దఫాలుగా 1,800 బస్తాల యూరియా అందజేశారు. అయినా గ్రామాల్లో చాలా చోట్ల వరి నాట్లు పడలేదు. నాట్లు పడిన పొలాల్లో కలుపు సైతం తీయలేదు. దీంతో సరిపడా యూరియా దొరకడం లేదని కర్షకులు వాపోతున్నారు. మంగళవారం తెల్లవారుజామునే గ్రామాల నుంచి వచ్చి మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్నారు. ఇస్తారనే ఆశతో గత మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. పీఏసీఎస్ సిబ్బంది రసీదులు కూడా పంపిణీ చేసింది. వాటిని చేతబట్టిన రైతులు యూరియా కోసం ఎదురు చేస్తున్నారు. ఇప్పటికై నా సకాలంలో ఎరువులు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇదే విషయంపై మండల వ్యవసాయాఽధికారి వెంకటేశంను వివరణ కోరగా.. కచ్చితంగా యూరియా వస్తుందని చెప్పారు. రాగానే అందరికీ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
యూరియా కోసం రైతుల పడిగాపులు
మంచాల పీఏసీఎస్ కేంద్రంలో ఉదయం నుంచే క్యూ
మూడు రోజులుగా అవస్థలు పడుతున్న కర్షకులు


