పైసామే పవర్!
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2026
షాద్‌నగర్: ఎన్నికల బరిలో నిలవాలన్నా.. ప్రత్యర్థిపై గెలవాలన్నా.. మందీమార్బలంతోపాటు ఆర్థిక బలం ఉండాల్సిందే.. రూ.వేలు రూ.లక్షలు దాటి ఎన్నికల ఖర్చు రూ.కోట్లకు చేరింది. చైర్మన్ పీఠాలు, కౌన్సిలర్ పదవులు సాధించాలంటే డబ్బులు ఖర్చు చేయాల్సిందే. ఇందుకు గాను ప్రధాన పార్టీలు ఆర్థికంగా కాస్తా బలంగా ఉన్న అభ్యర్థులనే మున్సిపల్ ఎన్నికల బరిలో దింపాలని చూస్తున్నాయి. అన్ని పార్టీలు పార్టీ ఫండ్‌తోపాటు స్వయంగా ఖర్చు చేసే నేతల వైపు చూస్తున్నాయి. అర్థబలం, అంగబలం ఉన్న వారిని బరిలో దింపితే ఎన్నికల ఖర్చుకు వెనుకాడరనే అభిప్రాయం అందరిలో ఉంది.
పదవి కోసం ఎంతైనా..
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నియోజకవర్గాల ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఖర్చు చేశారంటే అతిశయోక్తి కాదు. చాలా గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు చెల్లించిన వారు ఉన్నారు. తమ పదవి కోసం కోట్ల రూపాయలు వెచ్చించారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురుకానుంది. ఈ లెక్కన ఒక్కో వార్డులో సుమారు రూ.25 లక్షల దాకా ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆర్థిక బలం ఉన్న నేతల కోసం
మున్సిపల్ ఎన్నికల్లో ఆర్థిక బలం ఉన్న నేతలను బరిలో దింపేందుకు ప్రధాన పార్టీలు మొగ్గుచూపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీల నేతలు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచూతూచి వ్యవహరిస్తున్నారు. ధన బలంతో పాటు, ప్రజా బలం కూడా పరిగణలోకి తీసుకొని టికెట్లు ఇస్తామని అధిష్టానాలు స్పష్టం చేస్తున్నాయి. అన్ని రకాలుగా బలమైన వారినే బరిలోకి దింపితేనే విజయం సాధిస్తామనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రజా బలం కోసం
ఆశావహులు కొందరు ఇప్పటికే కాలనీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో నిలబడుతున్నామని, తమకు మద్దతు తెలపాలని ఓటర్లను వేడుకొంటున్నారు. తమవైపు తిప్పుకొని విందులు ఇవ్వడం ప్రారంభించారు.
ఆర్థిక బలం ఉంటేనే ఎన్నికల బరిలోకి..
అలాంటి అభ్యర్థులవైపే ప్రధాన పార్టీల మొగ్గు
డబ్బుల సర్దుబాటు కోసం ఆశావహుల ప్రయత్నాలు
షెడ్యూల్ వచ్చేసరికి పోగుచేసుకునే పనిలో నేతలు
మున్సిపల్ ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎలాగైనా పోటీ చేయాలనుకునే వారు డబ్బులు సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఓవైపు టికెట్ కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్న వారు ఎక్కువ మొత్తం భరించాల్సిన పరిస్థితి నెలకొంది. క్యాంపుల ఏర్పాటు, కౌన్సిలర్ల మద్దతు కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మూడేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండటంతో చాలామంది నేతలు డబ్బుల కోసం వేట ప్రారంభించారు. షెడ్యూల్ వచ్చేలోపు డబ్బులు సిద్ధం చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
పైసామే పవర్!


