పేదలకు ‘ఉపాధి’ని దూరం చేసే కుట్ర
గెలుపు గుర్రాలకే మున్సిపల్ టికెట్లు
● అందుకే పథకానికి పేరు మార్పు
● డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి
● చేవెళ్ల మండలం ఆలూరులో నిరసన
చేవెళ్ల: పేదలకు ఉపాధిని అందించే ఉపాధి హామీపథకాన్ని వీబీజీ రామ్‌జీ పేరుతో దూరం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరులో 2004లో ఉపాధి హామీ పథకం ప్రారంభించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ వేసిన పైలాన్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రతిపల్లెలో తిరిగి ఉపాధి హామీ చట్టం రద్దుతో జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు తెలియజేస్తూ, బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలంటూ అవగాహన, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఈపథకం ద్వారా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కుటుంబానికి పేరు వస్తుందనే పేరు మార్చి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కొత్తగా వీబీజీ రామ్‌జీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కేటాయించాలనే నిబంధన తీసుకు రావాలని చెప్పడం వెనుక పథకాన్ని నీరుగార్చే ఉద్దేశం ఉందని తేటతెల్లమవుతోందన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన బీంభరత్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బి.జ్ఞానేశ్వర్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగౌడ్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, పంచాయతీరాజ్ సంఘటన్ చైర్మన్ రాచమొళ్ల సిద్దేశ్వర్, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్‌రెడ్డి, మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో అధిష్టానం ప్రత్యేకంగా నిర్వహించే సర్వే ఆధారంగా గెలిచే వారికే టికెట్ల కేటాయింపు ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్‌ల టికెట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఇన్‌చార్జి, ముఖ్యమంత్రి పరిశీలించి కేటాయిస్తారన్నారు. టికెట్ల కేటాయింపు కమిటీలో జిల్లా అధ్యక్షుడు కన్వీనర్‌గా, ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే ఇన్‌చార్జి, ఎంపీ, జిల్లాలో ముఖ్యనాయకులు ఉంటారన్నారు. వారంతా కలిసి అధిష్టానం నిర్వహించే సర్వే ఆధారంగా గెలిచే వ్యక్తులకే టికెట్లు కేటాయింపు చేయనున్నట్టు వివరించారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.


