సహాయ ఉపకరణాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం రూరల్: దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు సహాయ ఉపకరణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాటరీ వీల్‌చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, హైబ్రిడ్ వీల్‌చైర్ అటాచ్‌మెంట్‌తో కూడిన వీల్‌చైర్స్, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్‌టాప్స్, ఉన్నత విద్య, సాంకేతిక విద్యార్థులకు ల్యాప్‌టాప్స్ అందించనున్నట్టు తెలిపారు. అర్హులైనవారు ఈనెల 21 నుంచి 30వ తేదీ లోపు ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తుక్కుగూడ: గ్రామీణ క్రీడాకారులను ప్రంపచ చాంపియన్‌లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి అన్నారు. తుక్కుగూడ బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సీఎం కప్ 2025–26 గ్రామస్థాయి క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. పల్లెల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే సీఎం కప్ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. విజేతలకు ట్రోఫీలతో పాటు, నగదు బహుమతులు అందిస్తామన్నారు. కా ర్యక్రమంలో ఎంఈఓ కస్నానాయక్, హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
యాచారం: వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపారనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివీ.. యాచారం పంచాయతీ పరిధిలో కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు 70కిపైగా వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపారన్న సమాచారం మేరకు స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అదులాపురం గౌతమ్, నుడావత్‌ప్రీతి, ఈలప్రోల్ అనిత, ఈలప్రోల్ భానుప్రకాశ్‌రావు, మూల రజిని మంగళవారం యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మేనకాగాంధీకి సైతం ఫోను ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆమె కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేశారు. కలెక్టర్ యాచారం సీఐకి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి కిషన్‌ను సంప్రదించగా తాను ఐదు రోజుల పాటు సెలవులో ఉన్నట్లు తెలిపారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ సెక్టార్‌లోని దుర్గం చెరువు నుంచి వెలువడుతున్న దుర్గంధాన్ని దూరం చేయడంపై హైడ్రా దృష్టి పెట్టింది. మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెరువును పరిశీలించారు. సగం వరకు గుర్రపు డెక్క పెరగడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాట్ (ఎస్టీపీ) ఉన్నా వరద కాల్వ ద్వారా మురుగు నీరు నేరుగా కలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీపీల సామర్థ్యానికి మించి వచ్చే మురుగును కాల్వల్లోకి మళ్లించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ శాఖ, రహేజా మైండ్‌స్పేస్, ఎస్టీపీల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రాంకీ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడమే దుర్గంధానికి కారణ మని పేర్కొన్నారు. అనంతరం హైడ్రా కార్యాలయంలో చెరువు పరిరక్షణ బాధ్యతలు చేప ట్టిన సంస్థలతో ఆయన సమావేశమయ్యారు. వరద కాల్వలోకి మురుగు నీరు వెళ్లకుండా పైపులైన్ డైవర్షన్ పనులు చేపట్టడానికి జలమండలికి ఉన్న ఇబ్బందులకు పరిష్కారం చూపారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్‌తో మాట్లాడిన రంగనాథ్ ట్రాఫిక్ మళ్లింపుల అమలుకు సహకరించాలని కోరారు. రహేజా సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఇనార్బిట్ మాల్, నెక్టర్ గార్డెన్స్ సహా చెరువు పై భాగంలో ఉన్న ఐటీ సంస్థల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులో కలవకుండా పడమరవైపు కాల్వ తవ్వేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


