అవగాహనతో ప్రమాదాల నివారణ
మొయినాబాద్: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా, మద్యం తాగి వాహనాలు నడపడంతోపాటు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడమే అని ఎమ్మెల్సీ, మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని జేపీఎల్ కన్వెన్షన్‌లో మంగళవారం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ పేరుతో డ్రైవర్లు, యువతకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏటా సుమారు 26 వేల ప్రమాదాలు జరుగుతూ సుమారు 8 వేల మంది మరణిస్తునారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో 83 శాతం 18–63 ఏళ్ల వయసువారేనన్నారు. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం టాప్ 10లో ఉండటం బాధాకరమన్నారు. ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు ప్రమాదకరమైన రోడ్లను బాగుచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకోసం ద్విచక్ర వాహనదారులకు వెయ్యి హెల్మెట్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. డీసీపీ యోగేష్‌గౌతం మాట్లాడుతూ.. డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఉండొద్దని.. వాహనంలో ఉన్నవారితోపాటు మీ ప్రాణాలు కూడా మీచేతుల్లోనే ఉంటాయన్నారు. అనంతరం ప్రమాదాల నివారణకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ఏసీపీలు కిషన్, చంద్రశేఖర్, జిల్లా రవాణాశాఖ అధికారి సాయి కృష్ణవేణి, ఆర్టీసీ డీఎం కృష్ణమూర్తి, మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి


