దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం రూరల్: పోలీసుల ఎదుటే తనపై దాడి చేసి, నానా బూతులు తిట్టి, తన కుమారుడిని ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పడాల కరాటే కళ్యాణి (సినీనటి) మంగళవారం ఆదిబట్ల పోలీసులను ఆశ్రయించింది. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం సాక్షిగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న కాస ప్రవీణ్, సిద్దమోని నరేందర్ అమాయకులను ఆసరాగా చేసుకొని డబ్బులు కాజేస్తున్నారని.. హిందూ ధర్మంకోసం పోరాడుతుంటే తనపై దాడికి యత్నించారని ఆవేదన వ్యక్తం చేసింది. అమాయకులను వలలో వేసుకొని లక్కీ డ్రాల పేరుతో మోసం చేస్తున్నారని ఈనెల 14న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు బెట్టింగ్‌యాప్ లక్కీడ్రా నిర్వాహకుల స్థావరం గుర్తించారు. ఆదిబట్ల సమీపంలోని కొంగరకలాన్ వద్ద ఓ విల్లాలో ఉండగా పంజాగుట్ట పోలీసులతో కలిసి కరాటే కళ్యాణి వెళ్లింది. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రశ్నిస్తుండగా ఆమైపె ప్రవీణ్, నరేందర్ అనే బెట్టింగ్ నిర్వహకులు, వారి ముఠా దాడి చేసినట్లు తెలిపింది. లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇలాంటి మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదిబట్ల సీఐ రవికుమార్, ఎస్‌ఐ సత్యనారాయణను కోరింది. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నరేందర్ క్రేజీ బాయ్స్ పేరుతో చౌటుప్పల్‌లో బట్టల దుకాణం నడిపిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం లక్కీ డ్రా తీస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.
ఆదిబట్ల ఠాణాలో కరాటే కళ్యాణి ఫిర్యాదు


