టైరు మారుస్తుండగా..
ఇబ్రహీంపట్నం రూరల్: పంక్చర్ అయిన టైరును మారుస్తుండగా లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఓ అభాగ్యుడిని పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓఆర్‌ఆర్‌పై మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 12 వద్ద నారాయణ బాలికల హాస్టల్ సమీపంలో టాటా ఏసీ టైరు పంక్చర్ అయింది. దీంతో డైవర్ దీలిప్ వాహనాన్ని పక్కకు నిలిపి సహాయకుడు వెంకట్‌రెడ్డితో టైర్ మార్చుతున్నారు. అంతలోనే వెనకాల నుంచి అతివేగంగా వచ్చిన ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దిలీప్(28) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించారు. మరోవైపు వెంకట్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని రాగన్నగూడ సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ సాగిస్తున్నారు.
● దూసుకొచ్చిన మృత్యువు
● ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం
● ఒకరి దుర్మరణం, మరొకరికి గాయాలు


