చికిత్సకు నిరీక్షణే..
దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు క్యూ సరైన వైద్య సేవలు అందక బాధితుల ఆందోళన రక్త, మూత్ర పరీక్షల రిపోర్టులకు తప్పని తాత్సారం అందుబాటులో ఉండని వైద్యులు.. మందులు అరకొరే
ఆస్పత్రుల్లో తప్పని పడిగాపులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పల్లెకు సుస్తీ చేసింది.. చికిత్స చేసే నిపుణులు అందుబాటులో లేకపోవడం.. ఉన్న వాళ్లు కూడా నిర్దేశిత సమయానికి ఆస్పత్రికి రాకపోవడం.. వచ్చిన వాళ్లు మధ్యాహ్నం ఒంటిగంటకే తిరుగుముఖం పట్టడంతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు సహా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుకుంటున్న నిరుపేదలకు కనీస వైద్యసేవలు అందకుండా పోతున్నా యి. మెజార్జీ వైద్య సిబ్బంది వేళకు రావడం లేదు. స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆయాలే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. నాడిపట్టి చూడటం మొదలు.. మందులు, ఇంజక్షన్లు ఇవ్వడం వరకు అన్నీ వారే కానిచ్చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలపై సోమవారం ‘సాక్షి’ బృందం విజిట్ నిర్వహించింది. మెజార్టీ ఆస్పత్రుల్లో ఆల్ట్రాసౌండ్ మిషన్లు సమకూర్చినప్పటికీ రేడియాలజిస్టులు/గైనకాలజిస్టులు లేకపోవడంతో రోగులకు ఆ తరహా సేవలు అందకుండా పోతున్నాయి. ఎక్సరే మిషన్లు ఉన్నప్పటికీ.. టెక్నీషియన్ల కొరతతో ప్రైవేటుకు వెళ్లాల్సి వస్తోంది. రోగుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపుతున్నారు. థైరాయిడ్‌తో బాధపడుతున్న వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. నేరుగా రోగుల ఫోన్ నంబర్లకే రిపోర్టులు జారీ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ చెబుతున్నప్పటికీ..గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రోగులకు ఈ సాంకేతికతపై సరైన అవగాహన లేక ఇబ్బందులు తప్పడం లేదు. 24 గంటల తర్వాత కూడా రిపోర్టులు చేతికి అందకపోవడంతో జ్వరపీడితుల ఆరోగ్యం మరింత దెబ్బతింటున్నట్లు తేలింది. మారుమూల పల్లెల్లోనే కాదు మున్సిపాలిటీ కేంద్రాలు, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి.
మచ్చుకు కొన్ని..
నిరంతరం పర్యవేక్షణ
మెరుగైన వైద్యసేవలు అందించాలనేదే లక్ష్యం. వైద్య సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సమయ పాలన పాటించని వైద్య సిబ్బందితో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలోనే ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలో మందుల కొరత లేదు. ఖాళీల భర్తీ కోసం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాం.
– డాక్టర్ కె.లలితాదేవి, జిల్లా వైద్యాధికారి
చికిత్సకు నిరీక్షణే..


