మహిళాభివృద్ధే లక్ష్యం
ఇబ్రహీంపట్నం: మహిళలను శక్తివంతులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా 87 డ్వాక్రా సంఘాలకు రూ.3.50 కోట్ల వడ్డీలేని రుణాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, అభివృద్ధికి రేవంత్ సర్కార్ శాయశక్తులా కృషి చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రేషన్‌కార్డులు తదితర సంక్షేమ పథకాలను అమలు పరుస్తోందన్నారు. ఆర్థికంగా ఎదిగేందుకే వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించానన్నారు. మభ్యపెట్టి ఓట్లు దండుకునే వారికి వచ్చే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పాండు రంగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కరుణాకర్, డ్వాక్రా సంఘాల మహిళలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


