‘భూమి తీసుకుని బెదిరిస్తున్నారు’
శంకర్‌పల్లి: ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కు అధినేత రాందేవ్‌రావు తమ భూములను ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుని, డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ప్రొద్దుటూరుకు చెందిన బాధితులు సోమవారం సదరు పొలాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్ 305/2లో ఎరుకలి మల్లమ్మకు 1.20 ఎకరాలు, 305/3లో ఎరుకలి రామయ్యకు 2 ఎకరాలు, 306లో ఎరుకలి పెంటయ్యకు 1.02 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూములను 2020లో ఐదేళ్ల కోసం రూ.32 లక్షలకు లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలని పలుమార్లు రాందేవ్‌రావు వద్దకు వెళ్లగా బెదిరింపులకు పాల్పడున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు మలమ్మ, నర్సింలు, యాదగిరి, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
చట్టప్రకారం ముందుకెళ్తా..
ఈవిషయమై ఎక్స్‌పీరియం అధినేత రాందేవ్‌రావును వివరణ కోరగా.. 2020లో తాను భూమిని లీజుకు తీసుకున్న మాట వాస్తవమేనని, ఇందుకోసం 99 ఏళ్లకు గాను సదరు యజమానులకు రూ.13 లక్షలు ముందుగానే చెల్లించానని తెలిపారు. వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, చట్టప్రకారం ముందుకు వెళ్తానని స్పష్టంచేశారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
రాజేంద్రనగర్: ఆరాంఘర్ చౌరస్తాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ వృద్ధుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన మేరకు..భరత్‌నగర్‌కు చెందిన గంటా నాయక్ (70) సోమవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై ఆరాంఘర్ వైపు వెళుతున్నాడు. బహదూర్‌ఫురా నుంచి ఆర్‌ఎంసీ లోడ్‌తో వస్తున్న అశోక్ లే ల్యాండ్ వాహనం అదుపుతప్పి గంటా నాయక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు పోలీసులు మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన సుధీర్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
మేడిపల్లిలో యువకుడు..
మేడిపల్లి: కాప్రాలో నివాసముంటున్న రిషబ్ శర్మ (26) సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ నుంచి ఘటికేసర్‌వైపు తన ద్విచక్రవాహనంపై వెళుతుండగా మేడిపల్లి బస్టాప్ వద్ద వెనుకనుంచి అతివేగంగా వచ్చిన అయిల్ ట్యాంకర్ రిషబ్ శర్మను బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రేషన్ డీలర్‌పై విచారణ
యాలాల: మండల పరిధిలోని నాగసముందర్ రేషన్ డీలర్ పద్మమ్మపై సోమవారం ఆర్‌ఐ శివచరణ్ విచారణ చేపట్టారు. లబ్ధిదారులకు ఐదు కిలోల చొప్పున బియ్యం తక్కువగా వేస్తున్నారని, నిలదీసిన వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి మహేందర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా ఆర్‌ఐ విచారణ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు తెలిపారు.


