పుర పోరు.. సందడి షురూ
రిజర్వేషన్లు వెలువడడంతో ‘పుర పోరు’ మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులంతా టికెట్ల వేట మొదలు పెట్టారు. రిజర్వేషన్లు కలిసిరాని నాయకులు పక్కవార్డుల వైపు చూస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు సైతం గెలుపు గుర్రాలను అన్వేశించే పనిలో పడ్డాయి.
షాద్‌నగర్/మొయినాబాద్: మున్సిపల్ సమరానికి సర్వం సిద్ధం అయ్యింది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఎన్నికల నిర్వాహణకు నేడో రేపో షెడ్యూల్ విడులయ్యే అవకాశాలు ఉన్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలు రూపొందించే దిశగా పార్టీల ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు.
వీడిన ఉత్కంఠ
కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. చైర్మన్ పీఠంతోపాటు, వార్డుల రిజర్వేషన్లు కలెక్టర్ ప్రకటించారు. రొటేషన్ ప్రాతిపదికన వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్ధతిలో మహి ళల స్థానాలను కేటాయించారు. దీంతో ఆశావాహుల నిరీక్షణ ఫలించింది.
బలమైన అభ్యర్థుల కోసం..
ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థులను గుర్తించేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీతో పాటు బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. వార్డుల్లో పోటీ చేసే ఆశావాహుల వివరాలను సేకరించే పనులు మొదలు పెట్టారు. ఒక్కో వార్డు నుంచి మూడు పేర్లు తీసుకుని అందులో ఎవరికి టికెట్ ఇవ్వాలనేదానిపై కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ఆశావహులతో అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఆర్థికంగా బలంగా ఉండి, ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న వారికి టికెట్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇందుకు గాను సర్వేల ద్వారా గుర్తించి ఎవరు మెరుగ్గా ఉంటే వారికి బీఫాం ఇవ్వాలని చూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే టికెట్లు ఎవరికి దక్కుతాయనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పొరపాట్లకు తావివ్వకుండా..
ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు తిరిగి తావివ్వకుండా అన్ని పార్టీల నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు నేతల ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన మద్దతుదారులు విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ బెదడ లేకుండా అందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రధాన పార్టీల నేతలు దృష్టి సారించారు.
ఆశావహుల ప్రయత్నాలు
పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే బీఫాం తప్పనిసరి. దీన్ని దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు మొదలుపె ట్టారు. నేతలను ఆకర్షించేందుకు, ఓటర్ల మద్దతు కూడగట్టుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
రిజర్వేషన్ల ప్రకటనతో మొదలైన హడావుడి
ఎన్నికల సమరానికి పార్టీల సన్నద్ధం
గెలుపు గుర్రాల కోసం వేట
మరోవైపు ఆశావహుల ప్రయత్నాలు


