‘ప్రీ యాక్టివేషన్’పై యాక్షన్
సాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్లతో పాటు అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులకు కలిసి వస్తున్న ప్రీ యాక్టివేషన్ దందాకు చెక్ చెప్పడానికి నగర పోలీసు విభాగం సిద్ధమైంది. ఇందులో భాగంగా సీసీఎస్ అధీనంలోని స్పెషల్ టీమ్ పోలీసులు నగరవ్యా ప్తంగా నిఘా ఉంచారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లోని కడప నుంచి వీటిని తీసుకువచ్చి, నగరంలో విక్రయించడానికి ప్రయత్నించి ఇద్దరు పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన 184 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం నాంపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ తరహా సిమ్‌కార్డుల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
నిబంధనలు పట్టించుకోని ఔట్‌లెట్స్
సెల్‌ఫోన్ వినియోగదారు ఏ సర్వీసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్‌కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు, వేలిముద్రలు కచ్చితంగా ఇవ్వాలి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనేక మంది సిమ్‌కార్డుల విక్రేతలు తమ వద్దకు వచ్చే సాధారణ వినియోగదారులకు తెలియకుండా వారి నుంచి గుర్తింపులు తీసుకుంటున్నారు. వేలిముద్రల సేకరణ సమయంలో మొదటి ప్రయత్నం విజయవంతమైనా.. అలా కాలేదంటే మరోసారి ఫింగర్ ప్రింట్స్ తమ వద్ద ఉండే మిషన్‌లో తీసుకుంటున్నారు. మొదటి ప్రయత్నంతో యాక్టివేట్ చేసినవి వినియోగదారుడికి ఇచ్చేసి పంపిస్తున్నారు. ఆపై రెండో ప్రయత్నంతో యాక్టివేట్ చేసుకున్నవి తమ వద్ద ఉంచుకుంటున్నారు.
ఇద్దరు కలిసి పదుల సంఖ్యలో..
ఏపీలోని కడప జిల్లా భద్రిపల్లికి చెందిన నేనావత్ దినేష్ కుమార్ నాయక్ కడపలో లావణ్య ఎంటర్‌ప్రైజెస్ సిమ్స్ డిస్ట్రిబ్యూటర్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. అదే జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రణపల్లి సాయి ప్రదీప్ ఓ సర్వీస్ ప్రొవైడర్ సంస్థలో సిమ్‌కార్డ్స్ ప్రమోటర్‌గా పని చేస్తున్నారు. ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డులకు ఉన్న డిమాండ్ తెలుసుకున్న ఈ ఇద్దరూ దాన్ని క్యాష్ చేసుకోవాలని పథకం వేశారు. కొన్నాళ్లుగా లావణ్య ఎంటర్‌ప్రైజెస్‌కు సిమ్‌కార్డ్స్ కోసం వచ్చే వినియోగదారుల్ని టార్గెట్ చేశారు. వారికి తెలియకుండా గుర్తింపులు, వేలిముద్రలు తీసుకుని సిమ్‌కార్డుల్ని యాక్టివేట్ చేస్తున్నారు. వీటికి హైదరాబాద్‌లో డిమాండ్ ఎక్కువగా ఉందని భావించి విక్రయించడానికి వచ్చారు. దీనిపై సీసీఎస్ స్పెషల్ టీమ్‌కు సమాచారం అందింది.
ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటేనే కట్టడి
ఏసీపీ జి.వెంకటేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ డి.బిక్షపతి నేతృత్వంలోని బృందం ఆదివారం నాంపల్లి ప్రాంతంలో వల పన్ని ఇద్దరు నిందితులను పట్టుకుని 184 ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాను పూర్తి స్థాయిలో అరికట్టాలంటే సిమ్‌కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్‌కు ముందు సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. పోస్ట్‌పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ–పెయిడ్‌ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తర్వాతే యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు.
అక్రమ సిమ్‌కార్డుల దందాపై సీసీఎస్ నజర్
వీటిని తరచూ వినియోగిస్తున్న అసాంఘిక శక్తులు
ఏపీ నుంచి తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయం
ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన స్పెషల్ టీమ్


