ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా షాక్
అక్కడికక్కడే వ్యక్తి మృతి
యాచారం: కూలీ డబ్బులు వస్తాయనే ఆశతో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఫ్యూజ్‌ను సరిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని సాయిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన ముద్దం పర్వతాలు(55)కు ఆదివారం అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పనిచేయకపోవడంతో మరమ్మతు చేయాలని, అందుకు కొంత డబ్బులు ఇస్తానని ఆశచూపాడు. దీంతో పర్వతాలు విద్యుత్ సరఫరా జరిగే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆఫ్ చేయకుండా ఫ్యూజ్ మరమ్మతు చేయబోయాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. న్యాయం చేసే వరకు మృతదేహన్ని తరలించే ప్రసక్తే లేదని ధర్నా చేపట్టారు. గ్రామస్తులు, పోలీసుల జోక్యం చేసుకుని కూలీ డబ్బులు ఆశ చూపిన సదరు రైతు మృతుడి కుటుంబానికి పరిహారంగా కొంత నగదు ఇస్తాననే హామీ ఇప్పించడంతో వారు శాంతించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కనీస సమాచారం ఇవ్వలేదు..
సాయిరెడ్డిగూడెంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫ్యూజ్ మరమ్మతు కోసమని ఆ గ్రామ రైతులెవరూ కనీస సమాచారం ఇవ్వలేదని కందుకూరు మండల విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కిన వ్యక్తి కనీస అవగాహన లేకుండా, విద్యుత్ సరఫరా అవుతున్నా ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆఫ్ చేయకుండానే ఫ్యూజ్ మరమ్మతు చేయబోయి షాక్‌కు గురై మృతి చెందాడని పేర్కొన్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్‌లో ఏమైనా సమస్యలుంటే గ్రామానికి సంబంధించిన విద్యుత్ సిబ్బంది లేదా మండల విద్యుత్ శాఖ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. అవగాహన లోపంతో మరమ్మతులు చేయబోయి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దన్నారు.


